BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

Showing posts with label క్లాసిక్. Show all posts
Showing posts with label క్లాసిక్. Show all posts



ఒక నిర్దిష్టమైన కథను ఎన్నుకుని దానిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, అద్భుతమైన దృశ్యకావ్యంగా మలచబడిన చిత్రం కె.విశ్వనాధ్ సృష్టించిన  "సాగర సంగమం".  1983 లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ మన మనసుల్లో చెక్కు చెదరకుండా ఉంది. అందులోని పాటలు, సంగీతం, చిత్రీకరణ, నటీనటుల హావభావాలు .. ఆ కథలో మనకు గోచరించిన ఎన్నో అంశాలు మరపుకురానివి.

ప్రతిభ ఉన్నా గుర్తింపు రాని ఒక నాట్యకారుడి జీవన సంఘర్షణ ఈ చిత్రం.  బాలకృష్ణ (కమల్ హాసన్)ఒక పేద యువకుడు. స్వయంకృషితో నాట్యం నేర్చుకుని కూచిపూడి, భరతనాట్యం, కథక్ రీతులలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. కాని కృతిమత్వం, విచ్చలవిడితనం, వాణిజ్య, వ్యాపారధోరణి,నిర్లక్ష్యంతో నిండిన సినిమారంగంలో ఇమడలేకపోతాడు. అతని కళకు తగిన గుర్తింపు దొరకదు ఎందుకంటే అతడు పేదవాడు కాబట్టి. తన విద్యతో అందరిని మెప్పించి గొప్పవాడై తల్లిని సుఖపెట్టాలని కోరుకుంటాడు కాని అతనికి సాయపడేవాళ్లు ఉండరు. అతనిలో ప్రతిభను గుర్తించిన మాధవి ( జయప్రద) అతనిని ప్రోత్సహించి డిల్లీలో జరిగే కార్యక్రమంలో అతని నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయిస్తుంది. కాని చివరి క్షణంలో అతని తల్లి చనిపోవడంతో ఆ అవకాశం కోల్పోతాడు. అతనికి తోడుగా నిలిచిన మాధవిని ప్రేమిస్తాడు. కాని ఆమెకు చిన్నతనంలోనే పెళ్లైందని తెలిసి కృంగిపోతాడు. తిరిగి వచ్చిన భర్తకు ఆమెను అప్పగించి తాను దేశదిమ్మరిగా మారి తాగుబొతు అవుతాడు. కొన్నేళ్లకు అనుకోని పరిస్థితులలో మాధవి కూతురు శైలజ(శైలజ) నాట్యప్రదర్శనలో ఆమెని తప్పు పడతాడు. అప్పటికే తాగుడు వల్ల అతడి ఆరోగ్యం చెడిపోతుంది. కాని తన నాట్యానికి వారసులు లేరనే బాధ మిగిలేఉంటుంది. అది తెలుసుకున్న మాధవి బాలుని తన కూతురికి గురువుగా నియమిస్తుంది. భర్త పోయినా బాలుకి తెలియ కూడదని బొట్టు పెట్టుకుంటుంది మాధవి. వాళ్లిద్దరి స్నేహం చూసిన కూతురు కూడా అపార్ధం చేసుకుంటుంది. చివరకు  తన నాట్యకళనంతా శైలజకు నేర్పించి ఆమె నాట్యప్రదర్శన చూసి తృప్తిగా కన్ను మూస్తాడు బాలు.


ప్రతిభావంతుడైన ఒక కళాకారుడు తనను అష్టకష్టాలు పడి పెంచి నాట్యాన్ని నేర్పించిన తల్లి హటాత్మరణం, అండదండగా నిలిచి, ప్రోత్సాహాన్నిచ్చి జీవితాంతం తోడుంటుందనుకున్న స్నేహితురాలు దూరం కావడంతో నిరాశకు లోనై తాగుడు వ్యసనానికి బానిస అవుతాడు.  ఆ మత్తులొ తన బాధను మరచిపోవాలని అనుకుంటాడు. ఐనా కూడా ఆ కళాకారుడు తనలోని కళ తనతోనే అంతమైపోకూడదనుకుంటాడు. ఈ సినిమాలో మనకు నిత్యం ఎదురయ్యే సంఘటనలు స్పష్టంగా చూడవచ్చు. సినిమా ప్రపంచంలో కళలను వ్యాపారధోరణిలో అపహాస్యం చేస్తున్న తీరు, శైలజ నాట్యంలోని లోపాలు పట్టించుకోకుండా పత్రికలు, ప్రముఖులందరూ ప్రశంసించడం లాంటివి చూస్తుంటే నిజమైన కళాకారులకు అస్సలు గుర్తింపులేదనే విషయం అర్ధమవుతుంది. ఇక్కడ చెప్పుకోదగిన మరో విషయం కీర్తికాంక్ష, అహంకారంతో శైలజ చేసే నృత్యంతో చిత్రం ప్రారంభమవుతుంది కాని చివరికి అదే శైలజ వివేకం, మాతృభక్తి, గురుభక్తి కళమీది గౌరవంతో నాట్యంలో లీనమై ప్రదర్శన ఇస్తుంది. అప్పుడామెను చూసిన బాలు తనలోని కళను సంపూర్ణంగా ఆమెకు నేర్పించి మాధవి ఋణం తీర్చుకున్నానని సంతృప్తిగా కన్ను మూస్తాడు. బాలు మరణీంచినప్పుడు నాట్య ప్రదర్శనకు అంతరాయం కలగకుండా రఘు వీల్ చైర్ ని నిశ్శబ్దంగా బయటకు తీసికెళతాడు. అప్పుడే మొదలైన వానలో బాలు తడవకుండా మాధవి గొడుగుపడుతుంది. ఈ సన్నివేశంలో బాలు జీవితంలో చివరివరకు తోడున్న రఘు, మాధవి ఉన్నతమైన వ్యక్తిత్వాలు ఆవిష్కృతమవుతాయి.

మాధవి తనకు మహామహులైన కళాకారులు, విద్వాంసులు పాల్గోనే కార్యక్రమంలో తనకు కూడా చోటు కల్పించిందనే విషయం తెలిసినప్పుడు, ఆ ప్రదర్శనకు బయలుదేరేసమయంలోనే తల్లి మరణించిన సన్నివేశాలలో కమల్ హాసన్ ప్రదర్శించిన నటన అద్భుతం అని చెప్పవచ్చు. అవకాశం వచ్చిందన్న విషయం తెలిసినప్పుడు అతనిలో దుఖంతో కూడిన ఆనందం, నమ్మలేకున్నా అది వాస్తవమే అని కనపడుతుంటే అతనిలో పెళ్ళుబికిన ఆనందం, ఆశ్చర్యం నాట్యరూపంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ సందర్భంలో కమల్ నటన మహాద్భుతం అని చెప్పవచ్చు.  ఒకప్పుడు ఒకరినొకరు ప్రేమించి జీవితభాగస్వాములు కావాలనుకున్నా కూడా కాలేక తమ మధ్య అనుబందాన్ని ఇతరుల క్షేమాన్ని కోరుకునే స్నేహంగా మార్చుకుంటారు.  కళలను ప్రేమించే, గౌరవించే వారందరికీ కె.విశ్వనాధ్ అందించిన మరపురాని ఆణిముత్యం "సాగర సంగమం". ఈ చిత్రానికి అందించిన సంగీతానికి ఇళయరాజాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని పురస్కారం వచ్చింది. అలాగే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకుని పురస్కారం లభించింది.  అలాగే ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం కూడా లభించింది.


దర్శకత్వం : కె.విశ్వనాధ్
నిర్మాత : ఏడిద నాగేశ్వరరావు
సంగీతం : ఇళయరాజా
నటీనటులు: కమల్ హాసన్, జయప్రద,ఎస్,పి.శైలజ, శరత్ బాబు,

సాగరసంగమంలోని మధురమైన పాటలు వినండి మరి..

Posted by జ్యోతి Sep 14, 2010


మన జీవితంలో ఆశ నిరాశలు, సుఖ దుఖాలు సర్వసాధారణం. అప్పుడప్పుడు కాస్త వెసులుబాటుగా ఉంటుందని సినిమాలకు వెళ్తాం. మనం చూసే సినిమాలన్నీ సందేశాలు ఇచ్చేవి, వినోదాన్ని ఇచ్చేవి మాత్రమే కాదు. మనసారా నవ్వుకునేలా చేసే హాస్యరసప్రధానమైన చిత్రాలెన్నో వచ్చాయి. ఈనాటి సినిమాల్లోని హస్యం అసంబద్ధంగా, వెకిలిగా ఉంటుంది. ప్రతీ కథలో హాస్యాన్ని బలవంతంగ జొప్పిస్తున్నారేమో అనిపిస్తుంది. కాని కొన్ని హస్య చిత్రాలు ఎప్పటికీ మనను నవ్విస్తూనే ఉంటాయి. తెలుగు సినిమాల్లో హాస్యానికి పెద్దపీట వేసి, చిత్రం మొత్తం హాస్యప్రధానంగానే నిర్మించిన ఘనత దర్శకుడు జంధ్యాలకే దక్కుతుంది. అడవిరాముడు, డ్రైవర్ రాముడు వంటి మాస్ సినిమాలకు మాటలు రాసిన జంధ్యాల హాస్యం కూడా తనకు పిల్లలాటే అని సున్నితమైన హాస్యంతో ఎన్నో సినిమాలు నిర్మించారు. అతని సినిమాలన్నింటిలో కామెడీకి పరాకాష్ట లాంటిది 1987 లో దర్శకత్వం వహించిన "అహా నా పెళ్లంట" అని చెప్పవచ్చు.

సత్యనారాయణ (నూతన్ ప్రసాద్) శ్రీమంతుడు . భార్య చనిపోయినా కొడుకు కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్) కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. ప్రేమ వివాహాలంటే తండ్రికి ఇష్టం లేకున్నా రాజేంద్రప్రసాద్ తన స్నేహితుడి పెళ్లిలో చూసిన పద్మ (రజని) ని ప్రేమిస్తాడు. ప్రేమ పెళ్లి వద్దని ఎంత చెప్పినా కొడుకు వినడు. పైగా పద్మ వెంకటాపురంలో పిసినారుల్లో మహా పిసినారి లక్ష్మీపతి కూతురని తెలుసుకుని అస్సలు వద్దంటాడు నూతన్ ప్రసాద్. ఐనా కూడా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టిన కొడుకుకు మూడునెలల్లొ తాను లక్షాధికారి కొడుకును అని చెప్పకుండా ఆ లక్ష్మీపతిని ఒప్పించమంటాడు. సరే అని వెంకటాపురానికి బయలుదేరుతాడు. లక్ష్మీపతి నౌకరు సాయంతో అతని ఇంట్లోనే అద్దెకు దిగుతాడు. ఇక అక్కడినుండి మొదలవుతుంది నవ్వులవాన. ఎక్కడా ఉధృతి తగ్గకుండా సినిమా ఆఖరు వరకు మనను నవ్విస్తూనే ఉంటుంది. పిసినారి మామకు అతనికి తెలియని మరిన్ని పిసినారి సలహాలు చెప్తూ అతనిని మించిన పిసినారిగా తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఇక్కడ మరో వ్యక్తి గురించి చెప్పకుంటే ఈ సినిమా కథ పూర్తి కాదు. అతనే అరగుండుగా నటించిన బ్రహ్మానందం. ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమకు ఒక మంచి హాస్యనటున్ని అందజేసారు జంధ్యాల. రాజేంద్రప్రసాద్ ఎత్తులు, జిత్తులు, బ్రహ్మానందం అవస్థలతో, లక్ష్మీపతి తనకంటే పిసినారి ఐన కృష్ణమూర్తిని తన అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. సినిమా చివరలో జరిగిన ట్విస్టుతో మారిన లక్ష్మీపతి తన పిసినారితనం వదిలేసి దానధర్మాలు చేస్తాడు.

ఈ సినిమా పేరు వినగానే ప్రతీవారి పెదవులపై మందహాసం రాకమానదు. వెంటనే కోటశ్రీనివాసరావు పిసినారి చేష్టలు, తన నౌకరు బ్రహ్మానందాన్ని చీటికి మాటికి జీతం కోసేయడం, అప్పుడతడు కడుపు మండి తిట్టే తిట్లూ, (శవాల మీద పైసలేరుకునే పీనాసి యెదవా, పోతావ్ రొరే, నాశనమైపోతావ్) అతని నటన, నత్తితో పడే పాట్లు అద్భుతం. రాజేంద్రప్రసాద్ చెప్పిన పొదుపు చిట్కాలు కోటకు తెగ నచ్చేసి వెంటనే అమలు చేస్తుంటాడు. ఉన్నది చాలక ఇంకా ఆదాయం పొందడానికి లక్ష్మీపతి రాత్రుళ్లు ముసుగేసుకుని బస్ స్టాండులో టీ అమ్మడం అది చూసి అతని బామ్మర్ది కలెక్టర్ కావలసినవాడు పిచ్చివాడైపోవడం, వంట కోసం వీధుల్లో పారేసిన అగ్గిపుల్లలు ఏరుకోవడం, కోడిని వేలాడదీసి ఉత్త అన్నం తింటూ కోడికూర తింటున్నట్టు ఊహించుకుని తృప్తి పడడం, ఐనదానికి కానిదానికీ పనివాడి జీతం కోసేయడం వగైరా చెప్పాలంటె ఎన్నో సీన్లు నవ్వులజల్లును కురిపించాయి.










Posted by జ్యోతి Jun 26, 2010





లక్నో అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖవాలీలు, వాహ్వాలు, నాట్యాలు, గుర్రపు బగ్గీలు, హుక్కాలు వెరసి ఒక అందమైన సాంస్కృతిక వాతావరణం. అంతే గాక లక్నో అనగానే వేశ్యలు వారి నృత్య విలాసాలకు ప్రసిద్ధి అంటారు. అటువంటి లక్నో నగరం, వేశ్యాజీవితాన్ని నేపధ్యంగా తీసుకొని 1981 లో ముజఫ్ఫర్ అలీ నిర్మించిన కళాత్మక దృశ్యకావ్యం "ఉమ్రావ్ జాన్" చిత్రం ఇప్పటికీ రసహృదయుల మనసుల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంలో ఆనాటి సామాజిక స్థితిగతులు, వేశ్యా సంస్కృతి కళ్లకు కట్టినట్టుగా చిత్రించారు. వేశ్యా జీవితాలు ప్రధాన కథావస్తువుగా గతంలో కొన్ని చిత్రాలు వచ్చాయి. అందులో మోఘల్ ఎ అజామ్, గమన్ , మండి మొదలైనవి. ఆయా చిత్రాల్లో స్త్రీని విలాసవంతమైన వస్తువుగానే తప్ప పవిత్ర ప్రేమకు, సహధర్మచారిని పాత్రకు పనికిరానిదిగా చూపించారు. అది వాస్తవమే కదా. లక్నోలోని అప్పటి వేశ్యలు శరీరాన్ని అమ్ముకునే స్త్రీలు మాత్రమే కాదు. సంగీత , సాహిత్యాలలో నిపుణులై ధనవంతులైన పురుషులను ఆకట్టుకునేవారు.


ఉమ్రావ్ జాన్ చిత్రం మిర్జా హదీ రుస్వా రచించిన “ఉమ్రావ్ జాన్ అదా” అనే నవల ఆధారంగా నిర్మించబడింది. అమీరన్ అనే అమ్మాయిని చిన్నపుడు పక్కింటి వ్యక్తి ఎత్తుకెళ్లి లక్నోలోని వేశ్యాగృహంలో అమ్మేస్తాడు. ఆ వేశ్యాగృహం యజమాని ఆ అమ్మాయిని ఉమ్రావ్ అని పేరు మార్చి చదువు, సంగీతం, నృత్యం నేర్పిస్తుంది. అలాగే తన అందంతో మగవారిని ఎలా అకర్శించాలో కూడా చిన్నప్పటినుండే ఉమ్రావ్ కి నేర్పబడుతుంది. ఉమ్రావ్ పెరిగి పెద్దదై అందమైన యువతిగా తన నృత్య, గానాలతో అందరినీ ఆకర్షిస్తుంది అలరిస్తుంది. నవాబ్ సుల్తాన్ , ఉమ్రావ్ జాన్ ప్రేమించుకుంటారు. కాని నవాబ్ ఆమెని పెళ్లి చేసుకొలేడు. కుటుంబ మర్యాద కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. దానితో ఉమ్రావ్ కృంగిపోతుంది .ఆ తర్వాత ఆమె జీవితంలోకి గజదొంగ ఫైజ్ ప్రవేశిస్తాడు. అతనితో పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ నాట్య వృత్తిని వదిలేసి అందరు స్త్రీలలా గౌరవప్రదమైన గృహిణిగా గడపాలనుకుంటుంది. కాని పోలీసులు ఆ గజదొంగని కాల్చి చంపుతారు. దానితో గత్యంతరం లేక తిరిగి తన వృత్తికే రాకతప్పదు. చిన్ననాటి మిత్రుడు గౌహర్ మిర్జా సాన్నిహిత్యంలో మనఃశాంతి, రక్షణని పొందుతుంది. ఈ అనుబంధాల మధ్య ఉమ్రావ్ జాన్ ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతుంది. బ్రిటీషువారి ఆక్రమణతో లక్నోవాసులందరూ పారిపోవాల్సి వస్తుంది. అలా పరిపోయిన ఉమ్రావ్ జాన్ బృందం ఒక గ్రామంలో ఆగుతారు. అది తన ఊరేనని, చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంది ఉమ్రావ్. తన తల్లి, సోదరులను కలుసుకుంటుంది. చనిపోయిందనుకున్న వ్యక్తి తిరిగిరావడంతో అందరూ సంతోషిస్తారు కాని వేశ్య ఐన కారణంగా ఆమెని తమ కుటుంబంలోకి ఆహ్వానించలేము, అంగీకరించలేమంటారు. హతాశురాలైన ఉమ్రావ్ జాన్ వేరే దారి లేక లక్నో చేరుకుంటుంది. అక్కడ శిథిలమైన వేశ్యావాటిక కనిపిస్తుంది. చివరకు ఆమెకు మిగిలింది ఆమె సంగీతం, కవిత్వం, వృత్తి..



1981 లో విడుదలైన ఈ చిత్రం రేఖ అత్యున్నత నటనా వైదుష్యాన్ని ప్రదర్శించింది. సౌందర్యమూ, సున్నితత్వమూ కలబోసిన ఉమ్రావ్ జాన్ చిన్నప్పటినుండి ఎదుర్కొన్న పరిస్థితులు , ఆమె ఎదుర్కొన్న సమస్యలు, విభిన్నమైన వ్యక్తుల ప్రభావం. వీటివల్ల నేర్చుకున్న పాఠాలతో తనను తాను మెరుగుపరుచుకుని మహోన్నత వ్యక్తిగా ఎదుగుతుంది. ప్రతీ ఆడపిల్లలా జీవితం గడపాలి. పురుషుడి ప్రేమలో మునిగిపోవాలి. ఈ వేశ్యావృత్తి వదిలి పెళ్లి చేసుకుని అందమైన జీవితం గడపాలని పడే ఆత్రుత, ఆ ఆశలు భగ్నమైనపుడు పడే ఆవేదనని ఉమ్రావ్ జాన్ గా ప్రతిభావంతంగా నటించింది. అసలు ఉమ్రావ్ జాన్ అంటేనే రేఖ అన్నట్టు చిత్రం మొత్తం ఆమే నిండిపోయింది. నటన ఐనా, నాట్యమైనా ఆమెకు ఆమే సాటి అని ఒప్పుకోక తప్పదు. రేఖ నటనకు ఆశా భోస్లే గానం తోడుకాగా, ఒక్కో పాటని మరచిపొలేని ఆణిముత్యంలా మలిచారు సంగీత దర్శకులు ఖయ్యాం. ఆ పాటలు ఇప్పటికీ నిత్యనూతనాలే.














Posted by జ్యోతి May 29, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!