BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

Showing posts with label Poem/కవిత. Show all posts
Showing posts with label Poem/కవిత. Show all posts


బ్లాగర్ తృష్ణ గారు దసరా శుభాకాంక్షలు చెప్తూ పెట్టిన స్కెచ్ బాగుందనిపించింది. అందుకే అలంటిదేదన్నా ఉంటే B&G కోసమని ఇవ్వమని అడిగాను. వెంటనే ఈ స్కెచ్ గీసి పంపారు. Woman in curves...


చూసి ఎలా ఉన్నదో చెప్పండి... :)

మదిలో ఆలోచనల సుడి గాలి
రేపిందొక వడ గాలి

ప్రశ్నల మీద ప్రశ్నలు
సమాధానాల నెవరి నడగాలి?

జవాబు దొరకక తిరుగుతున్న నాకు 
కనిపించిందొక అంగన
కలిగించింది సాంత్వన
చూపింది నా ఆలోచనలకొక పొంతన

పేరడిగాను
అన్నది కదా...

తెలియదా నేనెవరో
అవుతానా వేరెవరో
నీ అంతరంగాన్ని
అనంత జీవన సారాన్ని


అంటూ మొదలయ్యే నా "ప్రశ్నాంగన" అనే కవితకు చక్కగా సరిపోతుందీ స్కెచ్. అందుకే ఇక్కడ కవిత మొదలునిస్తున్నాను.

అడిగిన వెంటనే స్పందించి చక్కని స్కెచ్ నిచ్చిన తృష్ణ గారికి ధన్యవాదాలు. ThankQ Sis

Posted by గీతాచార్య Oct 19, 2010




క్రియ ఒకటే
జీ...వించడం!

బారులు దీరి
నెమ్మదిగా పాక్కుంటూ
దేనికోసమో ఆరాటపడుతూ
అధిగమించాలని పోటీ పడుతూ
క్రమశిక్షణతో...

బారులు దేలి
హాయిగా ఎగురుకుంటూ
దేనికీ ఆరాటం లేదనిపించేలా
మబ్బులతో పోటీ పడుతూ
స్వేచ్చాకర్షనతో...

క్రియ ఒకటే...
జీవించడమే!

సంసార సంచారం
సంచార సంసారం

పుట్ట నుంచి ప్రపంచంలోకీ...
ప్రపంచమంతా గూడుగానూ...

విస్తరించలేని కత్తిరింపు
కత్తిరించలేని విస్తరణ
చట్రంలో ఇరుక్కున్న్ పయనం
పయనమే బతుకు చట్రమైన వైనం

ఏదైనా జీవించడమే!

స్వేచ్చ తనకు తానైన బంధనం
రెక్క ముడవని నిరంతర శ్రమ జీవనం

బంధనంలోనే కల్పించుకున్న స్వేచ్చ
రెక్క విదిల్చిన తరంతర విహంగానం

జీవించడమే...
క్రియ ఒక్కటే-

వేరు వేరు సరళి
వినిపించేదొకే బ్రతుకు మురళి!

సంసార సంచారమైనా
సంచార సంసారమైనా...

అది జీవన సంబారమే!

రచన మాకినీడి సూర్యభాస్కర్

Posted by జ్యోతి Oct 3, 2010




వీధి కుక్క
వీధిలోనే ఉంది

కానీ వీథికి కొంచెం వారగా...
ఇంటి వాకిలి గట్టు మీద;
దానికేం తెలుసు, వీథే అనుకొంది
***
సరిహద్దుల గురించి బాగా తెలిసిన
మనిషి గట్టు మీద అది ఉందని దానికి తెలీదు
వీథి కుక్క అది కూడా వీథే అనుకొంది
***
అంతే, గేటు తీసుకుని బయటికొచ్చిన
సైకిలు చక్రం దాని మీదకి కావాలని ఎగిరింది
బిత్తరపోయి నిలుచుంది, ఏమీ అర్ధం కాక;

ఈ సారి రాయి ఒకటి వీపుకు తగిలి చుర్రుమంది
***
కాస్త దూరం పరిగెత్తి అటువైపు చూసింది
ఈ హఠాత్ బలప్రయోగం ఏమిటా అని
కోపపు చూపులు ఇంకా బలంగా గుచ్చుకున్నాయి.
ఇంకాస్త దూరం పోయి మరో మారు అటువైపు చూసింది
చక్రాలు రెండూ అప్పటికే ఎక్కడికో వెళ్ళిపోయాయి
***
వీథి కుక్క
వీధిలోనే ఉన్న చోట నెమ్మదిగా చతికిలబడింది
మళ్ళీ ఎప్పుడు పరిగెత్తాలో అని బిత్తర చూపులు చూస్తూ!
***
మరి దానికి సరిహద్దుల గీతల
మనసు మనసుకీ మధ్య
అవిభేద్యమైన గోడల గురించి తెలియదుగా...


రచన - సౌమ్య మాకినీడు

Posted by జ్యోతి Aug 26, 2010



ప్రతీ స్త్రీకి ప్రీతికరమైనది నుదుట బొట్టు, చేతికి రంగు రంగుల గాజులు. ముత్తైదువ ధరించే మట్టిగాజులైనా, అమ్మాయిలు వేసుకునే తళుకులు ,మెరుపుల మ్యాచింగ్ గాజులైనా, రత్నాలతో పొదిగిన బంగారు గాజులైనా.. వేటికవే ప్రత్యేకమైనవి.  రెండుచేతులనిండుగా అలంకరించుకున్న రంగు రంగుల గాజులకు శతాబ్దాలుగా సాంస్కృతిక, సామాజిక మతపరమైన గుర్తింపు , ప్రాధాన్యత ఉంది. ఆచార వ్యవహారాల్లో కూడా గాజులకు ప్రత్యేక స్థానం ఉంది. హైందవ స్త్రీలు, ముస్లీం స్త్రీలు వివాహమైన తర్వాత ఎళ్ల వేళలా తమ చేతులకు గాజులు ధరించి ఉంటారు. మట్టిగాజులు మాత్రం తప్పనిసరిగా ధరించాలి అంటారు. ఏ మహిళ ఐనా కులం, సంస్కృతి, వయసు, వైవాహిక స్థాయితో నిమిత్తం లేకుండా , ఆర్ధిక స్తోమతు బంగారు గాజులు ధరిస్తారు. 




గుజరాతీ, రాజస్థానీ వధువులకు పుట్టింటివారు ఒక దంతపుగాజును బహూకరిస్తారు. గుజరాతీ వధువు తొలిసారిగా గర్భవతి ఐనప్పుడు ఆమె ఆడపడుచు వెండి బ్రాస్‌లెట్ ను బహూకరిస్తుంది.  ఏడో నెలలో  నల్లదారం, ఐదు కౌడీల (ఒక రకమైన గవ్వలు)తో తయారైన బ్రాస్లెట్ ధరించాలని పెద్దలు చెప్తారు. ఆమెకు సుఖ ప్రసవం కోసం ఇలా చేస్తారని అంటారు.

దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఆచారాలు , సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గర్భవతి ఐన స్త్రీకి ఏడవనెలలో పుట్టింటికి తీసుకువచ్చే ముందు "వలైకప్పు (సీమంతం)" అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అన్ని రకాల , రంగుల గాజులు ఆమె చేతులకు అలంకరిస్తారు. ఓ చేతికి 21 గాజులు, ఇంకో చేతికి 22 గాజులు తొడుగుతారు. అంతే కాక ఆమెకు కొక్కేలతో ఉండే సన్నని వెండిగాజునిస్తారు. ప్రసవ సమయంలో ఈ కొక్కేల్ని విడదీస్తారు.  ఇక హైదరాబాదీ లక్కగాజుల అందాలు వర్ణింపతరమా?? మతం, వయసు తేడా లేకుండా ప్రతి మహిళను అకర్షించే ఈ లక్కగాజులు సోయగాలే వేరు.

క్రీ.పూ. 2300 - 1000 సంవత్సరాల నటి సింధు నాగరికతకాలం నాటినుండి ముంచేతులకు, మణికట్టుకు ఆభరణాలు ధరించే అలవాటు , ఆచారం ఉంది. మొహంజొదారోలో బయల్పడిన స్త్రీ బొమ్మ చేతినిండా గాజులు కప్పేసి ఉంటాయి. 

బెంగాలి వివాహితలు తమ వైవాహిక స్థాయికి గుర్తుగా "లోహా" లేదా "ఐరన్ కడా" అని పిలవబడే గాజును ధరిస్తారు. ఈ రోజుల్లో  ఉన్నవాళ్లు లోహాను బంగారంలో అందంగా పొదుగుతున్నారు. వధువుకు అందమైన శంఖు గాజులు, ఎర్రని లక్క గాజులు ధరింపచేస్తారు. పంజాబీ వధువుకు సన్నని దంతపు గాజులను తెలుపు, ఎరుపు రంగుల్లో ధరింపచేస్తారు. కాలానుగుణంగా లక్క, ప్లాస్టిక్ గాజులు వచ్చినా ఆచారం మాత్రం కొనసాగుతుంది. కొత్త కోడలు ఈ గాజులను మూడు నుండి ఆరు నెలలపాటు ధరిస్తుంది. అవి ఆమె చేతులకు ఉన్నంతకాలం ఆమెను నవవధువుగానే పరిగణించి ఇంటిపని, వంటపని అప్పచెప్పరు. ఆమె వంటగది ప్రవేశం చేసినప్పుడు ఆ గాజులను తీసి పూజారులకో, దేవాలయానికో బహుమతిగా ఇచ్చేస్తుంది.


క్రీ.పూ. 2300 - 1000 సంవత్సరాల నటి సింధు నాగరికతకాలం నాటినుండి ముంచేతులకు, మణికట్టుకు ఆభరణాలు ధరించే అలవాటు , ఆచారం ఉంది. మొహంజొదారోలో బయల్పడిన స్త్రీ బొమ్మ చేతినిండా గాజులు కప్పేసి ఉంటాయి. ముంజేతి కడియాలను చాలా అరుదుగా ధరిస్తున్నారు. లతలు, మొసళ్లు, సింహాలు, ఏనుగులు,నెమళ్లవంటి ముఖాకృతిలొ్రో ఉండే ముంజేతి కడియాలు ఇష్టపడని మహిళ ఉంటుందా. ఈనాడు మట్టిగాజులు, లక్క గాజులు, ప్లాస్టిక్ గాజులు, రాళ్ల గాజులు , నవరత్నాల గాజులు అంటూ విభిన్నమైన , వినూత్నమైన గాజులు అందుబాటులో ఉండి అతివలను అలరిస్తున్నాయి. కళ్లు చెదిరే మరికొన్ని గాజులను ఇక్కడ చూడండి.



సరోజని నాయుడు రాసిన ఈ కవిత గుర్తుచేసుకుందామా?


Bangle sellers are we who bear
Our shining loads to the temple fair...
Who will buy these delicate, bright
Rainbow-tinted circles of light?
Lustrous tokens of radiant lives,
For happy daughters and happy wives.

Some are meet for a maiden's wrist,
Silver and blue as the mountain mist,
Some are flushed like the buds that dream
On the tranquil brow of a woodland stream,
Some are aglow wth the bloom that cleaves
To the limpid glory of new born leaves

Some are like fields of sunlit corn,
Meet for a bride on her bridal morn,
Some, like the flame of her marriage fire,
Or, rich with the hue of her heart's desire,
Tinkling, luminous, tender, and clear,
Like her bridal laughter and bridal tear.

Some are purple and gold flecked grey
For she who has journeyed through life midway,
Whose hands have cherished, whose love has blest,
And cradled fair sons on her faithful breast,
And serves her household in fruitful pride,
And worships the gods at her husband's side.

Posted by జ్యోతి Jun 18, 2010






సురుచి బ్లాగర్ శ్రీమతి జ్ఞానప్రసూనగారు వేసిన ఈ చిత్రానికి ప్రమదావనం సభ్యులు కొందరు ఆశువుగా చెప్పిన అందమైన మాటలు, కవితామాలికలు...

సంజె కెంజాయ నారింజరంగు కుంకుమ పెట్టుకుని
వాలే పొద్దుల కెంపు ఎరుపుని చెక్కిళ్ళలో నిలుపుకుని
నడచి వచ్చే నిషా సుందరి వయ్యారాన్ని కన్నుల్లో కాటుక దిద్దుకుని
మేలిముసుగు సోయగాలతో , నును సిగ్గుల కలల బరువుతో
నా చూపుల తోరణాల దీపాలు నీ దారి కై వెలిగించుకుని
ఆశల లోగిలిలో, వలపు వాకిలిలో
ఒళ్లంతా కనులై, ఆ కన్నులనిండా నీవై
నిలిచి ఉన్నా.. నీ రాకకై..
సుభద్ర వేదుల



సందె రంగులలోని మెరుపమ్మని
గుండె సవ్వడిలోని తుళ్ళింతని
పండు వెన్నెల లోని విరి దండనీ
నిండు సందురుడా !!
లోకాల చిరుదీపాలని కంటి పాపలలో వెలిగించి
నీ రాకకై చూసే విరహిణిని
వాకిలి దాట లేని నీ మధురిమని
అత్త చాటు కోడలిని
తలుపు చాటు చామంతిని
నీ కౌగిలిలోని కస్తూరిని
శ్రీదేవి


ఆషాఢమాసాన అలనాటి ఉదయాన
తలపుల తూగుటుయ్యాలలో
నీ వలపు పిలుపులు వినిపిస్తుంటే
ఆచారాలు అడ్డం వచ్చి అడుగు ముందుకు పడకుంటే
తెల్లబోయిన పిచ్చి మనసుని
తుళ్ళిపడకుండా ఆపుదామని
కలలో వచ్చిన కలలన్నింటినీ కమ్మగా విడమరిచి
మేఘాల మాలికలో మమతలతో కలిపి గుచ్చి
నీకోసం పంపించా మేఘసందేశాన్ని...
కమ్ముకొస్తున్న మేఘాల చాటునుంచి పడే చినుకులో
కనులు ఎదురుచూసేది నీ జవాబు కోసమే అయినా
మనసు పలవరించేది మెత్తటి నీ అడుగుల సవ్వడికోసం..
అరమోడ్పులయిన కన్నులు మరింక ఆగలేనంటుంటే
సర్దుకోమంటున్న మనసుని సరిపెట్టుకోలేక
నీకోసమే వేచి చూస్తున్నా అభిసారికనై...

శ్రీలలిత



అమృత ధారల్లే నీ ప్రేమ ధార కురిపించమని వేడుకుంటున్నా,

కరుణించి నీ చిరునవ్వుల చిరుజల్లుని వరమిస్తావని ఎదురుచూస్తున్నా...

సృజన రామానుజన్




కలవర పరిచిన కంటి చాటు తలపేదో ఘడియ వేసిన గడప దాటి రానంటోంది నేస్తం.
దిక్కులు తోచని చూపేదో తనలోకి తనే చూసుకుని చెప్పుకుంటోంది దారి కాచినా కాన రాని చెలుని వూసులేవో.
అమావాశ రాతిరి వెలుగుతున్న చందమామ నువ్వన్నావు...
వెలుగుతున్న నా చూపు చుక్కాని గా దిక్కులు దాటి వస్తానన్నావు..
ఎక్కడున్నావు మిత్రమా..
విరహపు మంటలను దాచుకున్న సూరీడు కుంగి పోయాడు ఆ భారమేదో మోయలేక..
నల్ల మోము చేసిన చందురుడూ కంటికగుపడలేదు..
నీ మూడో కన్నైన నెమలి పించమే నా జలతారు మేలి ముసుగు నావరించిన చూపు రూపమై....
యోజనాల కావల కూడా నిన్ను వెతుకుతోంది..
జాగు చెయ్యక రావా? నీ చెలి గుండెల విరహపు వలపుల నెగడున చలి కాచుకోవటానికి......

భావన




నిన్నటి వెన్నెలరాత్రి జగమ౦తా నా తోడునే అన్నావు నేను మయమరిచిపోయాను..
తొలిజామున నన్ను వీడలేక వెళ్ళుతున్నావని నీతడిక౦టి నీ మనస్సు చదివాను...
పగలు గడిచి౦ది,రేయి కరిగిపోతు౦ది నీ కోస౦ ఘడియలు,విఘడియలు లెక్కిస్తూన్నాను...
నీ కోస౦ చేసుకున్న అల౦కరణ నన్ను వెక్కిరిస్తున్నా,నీ మీద నమ్మక౦తో వేచి చూస్తున్నాను...
ఊరిపోలిమేరలో నీ పాదల స్పర్శ కి తుళ్ళిపడి లేచాను,వీధి మలుపున నీ అలికిడికి నాకే తెలియక తలుపు తెరిచాను

...సుభద్ర కనుమూరి



మేలి ముసుగులోన దాగిన మూగ భావనలా .....?
కనుపాపల కవ్వించే వలపు తలపుల పులకింతలా....?
చంద్రవదన సోయగాల సంపెంగ నాసికా గుబాళింపులా..?

ఎవరి కోసమీ ఎదురు చూపులు ?

ఊహల ఊసుల విహరించే అతి లోక సౌందర్యమా !
హృదయ రాగాల పల్లకిని మోసే భావ చిత్రమా !
మధుర స్వరాలాపనల దాచి పెట్టే అరుణారుణ అధరామృత మాధుర్యమా !

ఎవరు నీవు .....?

పద్మకళ



ఇక నాకైతే కవితలు రావుగాని కొన్ని మాటలు...

ప్రియా ఇది నీకు సమంజసమా? పెళ్లి అయిన పదిరోజులకే నన్ను వదిలి పొరుగూరు వెళ్లావు. నువ్వు చెప్పిన సమయం దాటి పది నిమిషాలైంది. ఇంకా రావేంటి? ఇంట్లో అందరూ ఉన్నా నువ్వు లేక ఒంటరినయ్యాను. గడియారం ముల్లు కూడా బద్ధకంగా కదులుతుంది. పదిరోజుల క్రిందవరకు నువ్వెవరో?నేనేవరో? ఈ మాంగల్యబంధం ఎంత విచిత్రమైనది. మనిద్దరిని ఇంత దగ్గర చేసింది. నువ్వే నా లోకం అనిపిస్తుంది. అమ్మావాళ్లు కూడా గుర్తురానంతగా నన్ను ప్రేమిస్తున్నావు, లాలిస్తున్నావు. ఇంత త్వరగా ఒకరినొకరు విడిచి ఉండలేకున్నాం. మరి మావాళ్లని వదిలి వచ్చినా నాకు బెంగ లేదేలనో? ప్రతిక్షణం నీ సాంగత్యం కోరుకుంటున్న ఈ మనసుని ఎలా బుజ్జగించను. కాలం కదలదు, కాలు నిలవదు. మనసు నీ కొరకు తపిస్తుంది. చూపు గుమ్మంవైపే ఉంటుంది. ఎప్పుడెప్పుడు నిను చూస్తానా అని కళ్లు కాయలు కాచాయి. ఎన్నో ఊసులు చెప్పాలని ఉంది.

Posted by జ్యోతి May 28, 2010

యాడ్జనులకు ఉండాలి వక్షపాతాలు,
పురోగతికై కూడదు పక్షపాతాలు.

గురజాడ రచియించిన ముత్యాల సరాలు,
నీ గొంతులో పలికే తేనెలొలుకు స్వరాలు.

సుకవులకుంటుంది కవితావేశం,
నాకిపుడే కలిగింది భవితావేశం.

చిన్న వాడి చేతిలో ఎర్ర గులాబీలు,
కేసీయార్ ఢిల్లీల నడిపేది లాబీలు.

వయారి భామల హంస నడకలు,
వీధి వీధినా ఆకలి కేకలు.

Posted by గీతాచార్య Apr 30, 2010

ఫ్రెండ్స్ తో చాట్లో ఉండగా అలా అలవోగ్గా వచ్చిన నాలుగు మాటలు ఒక చిన్న కవితలా అనిపిస్తే ఇలా పెట్టేస్తున్నాను. బాగుందో లేదో మీరే చెప్పాలి మరి :-)

ఏదో అనుకుంటాము కానీ, 
చచ్చిపోతే మనకొచ్చేదేమీ లేదు

మనకర్థం కాదు కానీ, 
బ్రతికుంటే పోయేదీ లేదు


కవితిచ్చిన ఫ్రెండ్స్ కి కృతఙ్ఞతలు.







చివరలో మరో ఫ్రెండ్ చేసిన కొనసాగింపు చిన్న తవిక ;-)

పోయేదేమీ లేదంటే,
వచ్చేదేదో ఉందనేగా,
రాజుగారి పెద్ద భార్యా :D

Posted by గీతాచార్య Apr 27, 2010


మమతలెన్నో చూపావు,
నిజమని నా మనసు నమ్మింది.

ప్రేమనెంతో పంచావు,
అంతా నాకేమోయని పిచ్చి మెదడు
మిడిసి పడింది.

ఊసులెన్నో చెప్పావు,
బాసలెన్నో చేశావు,
చివరికి దూరం పెట్టావు.

మనసు భారమైంది,
మెదడు మొద్దు బారింది,
ఆశ ఓడి పోయింది,
చివరికి నా
గుండె ముక్కలైంది




Tried out in గీతాచార్య's style. ఒక్క పదాన్ని రీప్లేస్ చేయటం ద్వారా భావాన్ని, మూడ్ ని పూర్తిగా మారుద్దామని. భావం కానీ, మూడ్ కానీ పూర్తిగా మారలేదు కానీ, కాస్త సందర్భం మారినట్టుగా అనిపించింది.

ఆ వెర్షన్ ఇక్కడ చూడండి.

మమతలెన్నో చూపావు,
నిజమని నా మనసు నమ్మింది.

స్నేహమెంతో పంచావు,
అంతా నాకేమోయని పిచ్చి మెదడు
మిడిసి పడింది.

ఊసులెన్నో చెప్పావు,
బాసలెన్నో చేశావు,
చివరికి దూరం పెట్టావు.

మనసు భారమైంది,
మెదడు మొద్దు బారింది,
ఆశ ఓడి పోయింది,
చివరికి నా
గుండె ముక్కలైంది

కూసింత విషాదం లెండి ;-)

Posted by Srujana Ramanujan Mar 23, 2010

బాల్యం - రాత్రే!

వెన్నెలంత చల్లగా...
చందమామంత నిండుగా...
గాఢనిద్రంత మత్తుగా...
కలల ఊహలంత కొత్తగా... వింతగా...

బాల్యం - ఒక రాత్రే!

***

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో
లేలేత కిరణాలతో
శరీరాన్నీ, మనసునీ వేడెక్కిస్తూ
నాలో నవోదయ యౌవనాన్ని పుట్టించ్చాడు.

ఆ అందానికి దాసోహమై
ఈ కన్నె మనసును అర్పించేసాను...
నిన్ను విడచి ఉండలేనని ప్రమాణం చేసేసాను.

ఆ ధైర్యంతోనే కాబోలు,
వేడెక్కించే సహజ నైజం కాస్తా పోయి
చిటపటలతో చిర్రెత్తించడం మొదలెట్టాడు.

నాకూ కోపమొచ్చింది... ఒళ్ళు మండిపోయింది.

ఎంతైనా బలవంతుడు కదా!
నా నెత్తినెక్కి మొట్టికాయలు మోదాడు.

బాధతో
అతనికి దూరంగా
రూపాలు మార్చేసుకుంటూ నీడనై
నా పిల్లలతో సేద తీరాను.

***

ఎంత కాలముంటుందా పొగరు?
తగ్గుతూనే వచ్చింది!
పాపం, అంతలోనే వృద్ధాప్య భారం మీద పడిపోయింది.
చైతన్యం పోయి పడమటికి సాగిపోతూ...న్నాడు !

***

ఎంత కాలముంటుంది నా కోపం మాత్రం!
అతని బాధకి కరిగి చేరువై పోయాను.
నన్ను చూసేసరికి అతని మొహంలో ఎంత కళనీ!
చెప్పకపోడమే... నాలో కూడానూ!!

ఇద్దరం కలిసి మరోసారి అరవై ఏళ్ల పెళ్ళికి ముస్తాబయ్యాము...
రెండు పండిన
శిశు హృదయాలకు జరిగే పెళ్లి!

***

ఆడుతూ, పాడుతూ, త్రుళ్ళుతూ
కువకువలుగా...
రవరవలుగా
ఆ రెండు పిల్ల మనసులూ
నెమ్మదిగా
చీకటితో ఏకమయ్యాయి!

***

రాత్రయి - మరో తరం
బాల్యాన్ని పుట్టిస్తాయి!

Posted by జ్యోతి Dec 30, 2009

గమనిక అసలు మనసు పెట్టి B&G మీద కూచునే అవకాశం లేక పోవటం వల్ల ఈ నెల లో రెండో సగ భాగంలో ఒక వరుసలేకుండా (అదే ఏ వారం రావాల్సినవి అప్పుడు) టపాలు వచ్చాయేమో. ఇప్పుడు ఇయరెండు సందర్భంగా కొన్నిప్రత్యేక టపాలనుకున్నాను. అవి రేపెల్లుండుల్లో వస్తాయి. ఇవిగాక మరో పెద్ద ప్రయత్నమే చేశాను. అదీ ఫలిస్తుందేమో చూద్దాం.  మరో పది రోజులు వరుస కుదరకపోవచ్చునేమో. మన్నించ గలరు. క్షణం తీరిక లేని పరిస్థితి. మితృలు అప్పటికీ నాకు సహాయంగా సమయానుకూలంగా స్పందిస్తూనే ఉన్నారు. వారికి ధన్యవాదాలు
***   ***   ***

హమ్మయ్య గమనిక చదివి మన్నించారు కదా. ఇక ఈ చిరు కవిత చదివి పెట్టండి.


చెవిలో సెల్లుఫోను గీతాలు
చుట్టురా బస్సు హారన్ల పకపకలు

పైకి చూస్తే మిల మిల మబ్బులు
ఎదురుగ చూస్తే తళ తళ తారకలు

ఇంటికెళ్ళే గేదెలు
బడి బైట కెళ్ళే పిల్లలు

సిమెంటు రోడ్డు మీద నడకా
ఓపికుడిగి ఇంటికి చేరిక
ఇవే కదా సాయంకాలపు కబుర్లు
(రోజూ తప్పని ట్రబుళ్ళు)





 సాయంకాలాలు కాలేజీ బస్సు దిగగానే గమనించే దృశ్యాలకు అక్షర రూపం. ఎక్కడో కామెంటుగా పెట్టాను. ఒక గుర్తుగా ఉంటుందని ఇక్కడేస్తున్నాను.

B&G WISHES U ALL A HAPPY AND GR8 YEAR END

గీతాచార్య 

Posted by గీతాచార్య Dec 28, 2009




ఆటకే ... అమ్మ ఒడి

ఆటకే... అమ్మ ఒడి !
ఓ తరం పాటూ
కమ్మగా నిదరోయే కలల పానుపు

బ్రహ్మకో కల్పం పగలూ
మరో కల్పం రాత్రీ అయినట్టూ-

ఓ తరం రాత్రే కానీ...
తర్వాతో మూడు వారాలే - పగలు;

నాకు తెలిసీ తాతమ్మల తరం నుంచీ!

తాతమ్మనీ నానమ్మనీ అమ్మనీ
తరం తరం నిరంతరంగా
అందర్నీ అక్కున చేర్చుకుని
గోముగా లాలించింది!

ఇప్పుడు అమ్మాయినీ...

రానున్న తరం ప్రతినిధిగా
తల ఎత్తబోయే కొత్త మొలకకు
ఆలంబనమయ్యే వేదిక!

అమ్మల గన్న అమ్మలకే
అమ్మ ఒడి... ఓ చెమ్మ తడి!

అయినా
వంటింటి ఆటకే
పాపం, దానికి అమ్మ ఒడి!
           *
మంచాల దగ్గరా
వివక్ష ఉంటుందనుకోలేదు

పంటను విత్తే పట్టిమంచం
రాజ దర్పంతో పడక గదిలో
పరుపుల మెత్తదనం కప్పుకుని పడుకుంటే... 

పంట నందించే పురుటి మంచం-
వంటింటి ఆటకకే పరిమితం...

వంటింటికే అంకితమైన
అమ్మలా అమ్మమ్మలా తాతమ్మలా!


అమ్మతనాన్ని పొదువుకుందుకు...

చిట్టి కాళ్ళతో
బల్లి పాకుతున్న స్పర్శ-

రాతి గోడ గుండె కైనా పులకింత..
నిటారుగా నిలిపే  నిశ్చింత!

జారిపోతూ పట్టు కోసం
చొక్కాను బిగించే చిరు గుప్పిట-
చక్కిలిగిలి...గిలిగింత!

ఎత్తుకున్న చంటి దాన్ని
కావాలని జారవిడుస్తాను
నెమ్మది నెమ్మది నెమ్మదిగా-

అమ్మతనాన్ని పొదువు కుందుకు...
చెమ్మదనాన్ని చదువుకుందుకు...

అమ్మలైతే...


వ్యాధి వేలాడేసిన దిగులు మొహాల్లో
జీవితేచ్చను వెలిగించిన దీపం!

క్షతగాత్రుల బాధల పాటల పల్లవికి
నిత్య జాగరనా చరణ సవ్వడుల
చరణాలను రాత్రంతా పాడిన నైటింగేల్!

పరిచర్యను 'అమ్మ'లా చేసేదొక్క నర్సమ్మే!

నర్సమ్మలందరూ అమ్మ తెరెసా లే  కాదా?!

అమ్మలు కాకపోతే మరెవరు చెయ్యగలరు?
అంత ఓర్పుగా...అత్యంత నేర్పుగా...
అంత సున్నితంగా...అత్యంత సుందరంగా..

సేవకు రూపు కదా ఆడతనం!

సేవా వృత్తులను అమ్మలకే వదిలేద్దాం

ఓ టీచర్...
ఓ డాక్టర్ ...
ఓ లాయర్...
అమ్మలైనప్పుడు-

లోకాన్ని వొళ్ళో వేసుకుని
లాలిస్తూ మంచిని చెబుతారు...
మానవత్వం మప్పుతారు!


- మాకినీడి సూర్య భాస్కర్

Posted by జ్యోతి Dec 9, 2009

మరువం ఉష Says...

ప్రేమ జీవిస్తూనే వుందింకా,
ఏ అమృతం తాగిందో.
ఏ రూపున తానుందోనని
నేను వెదుకుతున్నానింకా.

నింగి వంక చూస్తే
నేలకి సారించిన చూపులతో
ప్రేమారగ తడమను మబ్బుచేతులు
ఈ వంకే చాపుతున్నట్లుంది.

నేల తీరును గమనిస్తే
కురిసే మంచు పొదివిపట్టి
గోరువెచ్చని కౌగిలితో హత్తుకోమని
సూరీడుకి కబురంపుతుంది.

సూరీడు యేడని వెదికితే
కడలి కన్నె వెంట అడుగులేస్తూ
ప్రియమార తనలోకి అదుముకోను
బొట్టు బొట్టునీ చుట్టుముట్టేస్తున్నాడు.

కడలి ఒడ్డున అడుగులేస్తే
అలల తనువు వెల్లకిలా పరుచుకుని
అంగుళం విడవక సైకతతిన్నెల్లో
తన ప్రియుని రూపు చిత్రిస్తుంది.

ఇసుక రేణువు మెరుపు ఎందుకంటే
ఎన్నిమైళ్ళన్నా ఈదులాడి
ఓ గవ్వ లోని బుల్లి నేస్తాన్ని
కవ్విస్తానన్నట్లే వుంది.

మువ్వంటి మగువ కెదురుపోతే
గువ్వంటి మావ గునుస్తుంటే
ప్రేమ తీర్థం ఇస్తానంటూ
కంటిపాత్రలు మళ్ళీ నింపుకుంటుంది.

పడతి మనసు దోచిన మగని పలుకరిస్తే
ప్రేమ సిరాతో లిఖించిన లేఖ
వేవేల పారాయణాలు చేస్తూ
జగతిన వున్నది తామిద్దరమేనన్నాడు.

ప్రేమలేఖలెన్నని లెక్కించబోతే
వసంతుడు తన చివురాకులు చూపాడు
లెక్కలేనన్ని చిరునామాలలో ప్రణయదేవత ఫక్కున నవ్వుతూ
నన్నాలింగనం చేసుకుని అడిగింది "ప్రేమ" ఎక్కడుందీ అని.


Many thanks to ఉష గారు.


చైతన్య కళ్యాణి

Posted by చైతి Nov 25, 2009

సృజన అనువదించిన ఒక కవిత ఇక్కడ చూడండి.



ప్రకృతిలోని సొగసులు
నీ నడకలోని హొయలు
ఆటలాడి వంటరినై ఉన్న
తుంటరిని చేశాయి

వంటరినై ఉన్న నన్ను
మీ ఇద్దరి అందం చూసిన క్షణం
పాడ మంది యుగళ గీతం
ఇప్పుడే ఒక్కటై జంటగా
నవ్వానిక నేను కొంటెగా

ఈ కవితకి స్పూర్తి అయిన ఆంగ్ల కవిత ఇదిగో...

The spring in your steps
And the spring in nature
Playing a match
That let me have a catch
Of a bit of happiness
In all my loneliness

In all my loneliness
This weather makes me
Light as a feather
Dreaming us together

ఏదో చిన్న ప్రయత్నమే తప్ప పూర్తి స్థాయి అనువాదం కాదిది. ఎప్పుడన్నా నేనే చెయ్యాలి. Thanks to Srujana for this work.

There no relation between the picture and the poem. Another version of this translation can be seen here

రెండు విడి విడి కవితలనుకున్నా ఇబ్బందేమీ లేదు. ;-)

Posted by గీతాచార్య Nov 18, 2009

కవి, సాహిత్య విమర్శకుడు, రచయిత ఐన శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారు అందించిన అందమైన కవిత..


మరీ అందగత్తేం కాదు

కానీ...
పులుగడిగిన ముత్యంలా ఉంది
ఏమనుకుంటుందోన్న ధ్యాసే లేదు
తదేకంగా చూస్తున్నా!



ముంగిట రంగోలీ దిద్దుతున్నదామె;
మెడ వంపులో వేలాడే చెవి లోలకం...
ముత్యం అంచు మీద చంద్రోదయం!

ఆమె
చాలా అందంగా ఉంది.


- మాకినీడి సూర్య భాస్కర్

Posted by జ్యోతి Nov 11, 2009


Naalo Nenu బ్లాగర్ సుజ్జి B&G కి ఒక చక్కని కవితనందించారు. అలాగే దానికి ఒక అందమైన బొమ్మని కూడా గీసిచ్చారు. అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే బంధాన్ని సాగదీపుడు వ్యవహారంలా కాకుండా హృద్యంగా అలతి అలతి మాటల్లో... ఎలా ఉందో మీరే చూడండి.

అలాగే ఇవాళ B&G పుట్టినరోజు కూడా.

సుజ్జి గారిచ్చిన కవిత...

Sujji Says...



(అన్నయ్య)
నువ్వు నాకు ఉహ వచ్చాక నే ఎరిగిన
మొదటి స్నేహితుడివి ..
మార్గదర్శివి ,
శ్రేయోభిలాషివి , శతృవ్వి ,
ఆసరా కోసం మొదట చూసే నా మనిషివి...


చీపురు పుల్లలతో ఆడిన కత్తి యుద్దాలు ,
తొండి చేసి నేను గెలిచే క్యారం బోర్డు ఆటలు ..
కలిసి పంచుకున్న బాల్యం లో
మనసు దాచుకున్న గుర్తులెన్నో ..


టెక్స్ట్ బుక్స్ , క్యాలిక్యులేటర్,
మెటీరియల్స్ , కంప్యూటర్
నువ్వు వాడినవే..
నువ్వు ఇచ్చిన పరిమళాలే..
ఎప్పుడు పెరిగి పెద్ద అయ్యామో
గురుతే లేదు సుమ్మీ ..!

జీవితాన్ని మలుచుకుంటూ, ప్రపంచాన్ని పెంచుకుంటూ,
నిన్నలా మనం లేకపోయినా..
నీకు - నాకు దూరం ఎంత పెరిగినా ..
నిన్ను- నన్నో దారం కలుపుతూనే ఉంటుంది..!

----- సుజ్జి



This poem is for my dearest brother, and the picture is drawn by me.


I thank Mr. గీతాచార్య for giving some space to my work in "Book & Galfriends"

Posted by గీతాచార్య Oct 28, 2009

వండుకు తిందాం రండి...
చేపల్నీ, రొయ్యల్నీ,
ఆ జల పుష్పాల్ని


చంపుకు తిందాం రండి...
కోతుల్నీ, మేకల్నీ,
నేల మీది చిన్ని జీవుల్ని,


వేటాడుదాం రండి...
పులుల్నీ, సింహాల్నీ,
అడవిలోని మృగరాజాల్ని,


తింటానికేదీ లేనట్లు ...
మన ప్రకృతిని చంపుకు తిందాం
మూగ జీవాల్నీ,
అరుదైన ప్రాణుల్నీ


చిన్ని చేపలు నీటిలో కదలాడుతుంటే
చూసే కన్నులదే పండుగ...
మరి మన కడుపులో అరిగిపోతే
వాటి బ్రతుకు కాదా దండుగ?
చంపే జనం... ఆలోచించరే...!


సృష్టి కోసం వచ్చే నేస్తాల్ని
విచ్ఛిత్తి చేసే మనం...
రేపు మనకీ గతి పడితే ఏమౌనని
ఆలోచించరు జనం


చిన చేపను పెను చేప,
చిన మాయను పెను మాయ
ప్రకృతి సిద్ధం కానీ,
పుస్తెలమ్ముకుని తినాలా పులసల్ని
జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే
మనం విడుస్తున్నాం విలువల వలువల్ని


ఇన్జన్రలు నాకు కవిత్వం రాదు. చదివేదీ తక్కువే, రాసేదీ తక్కువే. కథల్జెప్పమంటే ఎన్నైనా జెప్తం గానీ కవితల్రాయాలంటే కష్టమే. ఒక చిన్న సంఘటన జూసి పెద్ద కథని రాయగలను కానీ, ఒక సందర్భంలో భావావేశానికి గురయి కవితనల్లడం నాకు తెల్లేరు పై బైకు నడక. అంటే చాలా కష్టం అన్నమాట.

కానీ నాకో దురలవాటుంది. హఠాత్తుగా ఏదైనా సందర్భంలోనో, మాంఛి హుషారుగా ఉన్నప్పుడో నాకు ఏదో ఒక పాదం పుడుతుంది. (ఒక లైనలా strike అవుతుందలా). అక్కడి నుంచీ చెప్పాలనుకున్న కథలోని (అదే కవితలోని) లైన్లని ముందుకు కొన్నీ, వెనుకకు కొన్నీ అల్లుకుని కవితని సృష్టించేయగలను. కానీ అలాంటి సందర్భాలు చాలా అరుదు. కాస్తంత సున్నితత్వం ఉన్న వాళ్ళే కవితలల్లగలరు. Damn these emotions అనుకునే నాకు అన్నిసార్లూ ఆ శక్తి రాదు, ఆసక్తి ఉన్నా! ప్చ్.

ఇంతకీ విషయమేమిటంటే... మరువం ఉష గారు "జల పుష్పం" అని ఒక కవితా సంకలనం తలపెట్టారు. ఎవరి తల? ఎక్కడ పెట్టారు? I donno friends. ఏదో అలా ఫ్లోలో వచ్చింది ఫాలో కావాల్సిందే. మన్నించి. ఆ సంకలనాన్ని, దానికందిన ఒకటి రెండు కవితలు చూడగానే నాకో దుర్బుద్ధి పుట్టింది. అతిగా ఆశ పడే మగవాడూ, అతిగా ఆవేశా పడే ఆడదీ బాగు పడ్డాట్టు చరిత్రలో ఎక్కడా చెప్పబడలేదని తెలిసినా, పెద్దగా చరిత్రలేని ఊరు నుండీ వచ్చానన్న ధైర్యంతో ఒక కవిత రాద్దామనే దుస్సాహసానికి తలపడ్డాను. అయితే ఏం లాభం? ఆలోచన రాలేదు.


ఇందాకన బాబా గారిచ్చిన పులస అనే కవిత చదివాక హఠాత్తుగా "కడుపులో అరిగిపోతే వాటి బ్రతుకు కాదా దండుగ?" అనే వాక్యం/పాదం తట్టింది. వేటి బ్రతుకు? అనే ప్రశ్న వేసుకుంటే... చిన్నిచేపలు అనే ఆలోచన. సో, ఆ వాక్యం పైనపడ్డది. దండుగ అనే మాటతో word play ఆడితే ఐదో వాక్యం అలా వచ్చి చేరింది. ఇంటిగ్రిటీ దెబ్బ తిన్నా సరే అలా ఉంచేయాలని అనిపించింది. చిన్ని చేపలంటే మూగ ప్రాణులు కదా...! వాటికోసం ఆ పైన ఉన్న లైనూ, ఆలో చిస్తే ఏమని ఆలో’చించాలి’? వీటిలా మన బ్రతుకూ అయితే ఎలా అనే కదా! అలా ఆ క్రింది వాక్యం వచ్చి చేరాయి. ఇలా ప్రశ్నామృతం గ్రోలితే ఈ కవిత (నా బొంద దీన్నే కవితంటే మరి పెద్దలంతా వ్రాసేదాన్నేమనాలి? సో నాది తవిక) తయారైంది. అందుకే మూల వాక్యాన్ని (Pivot) బోల్డులో ఉంచుతున్నాను.

ఇందులో వేరే ఉద్దేశ్యాలు లేవు (అదే ఎవరన్నా మాంసాహారాన్ని తినే వాళ్ళని అవమానించటం????? ఇలాంటి ప్రశ్నలని లేవనెత్త వద్దు. నా ఉద్దేశ్యం కేవలం అరుదైన జీవుల్నైనా వదిలేయమని చేసే అభ్యర్థన. అంతే! అర్థమయిందనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనీసం understand అన్నా చేసుకోండి).

కవిత సంకలనంలో చేర్చదగిన స్థాయిలో ఉందో లేదో నాకు తెలియదు. జలపుష్పం అనే సంకలనానికి సరిపోతుందో లేదో కూడా. అన్ని జంతువుల్నీ చేర్చాను కదా! జూలో పెట్టినట్లు. బోల్ట్లు. కనీసం ఒక మమ్చి పనిని మరికొంత మమ్దికైనా తెలియజెప్పాను కదా.

కవితేమన్నా బాగుంటే అది బబా గారి మాయే. అద్భుతమయిన కవిత ద్వారా నాకు స్పూర్తినిచ్చారు. బాలేక పోతే అది నాతప్పే. గొప్ప inspiration దొరికినా ఉపయోగించుకోలేనందుకు.

మామూలుగా ఆంగ్లంలో వ్రాసుకున్న కవితల్ని తెలుగులో అనువదించుకుని పెట్టుకుంటాను. (భావం మాత్రమే కలుస్తుంది. ఏభాషకా భాషలో natural గానే ఉంటాయి).  బ్లాగుల్లో ఇప్పటిదాకా వ్రాసినవి అలాంటివే. ఇదొక్కటే డైరక్ట్ గా తెలుగులోనే వ్రాశాను.

కవితా లేదు, పోయం లేదు భావావేశం అసలేలేదు ఏక్ నిరంజన్!

అదండీ సంగతి.

Posted by గీతాచార్య Oct 2, 2009

ఈ కథ చెప్పింది "మరువం" ఉష గారు. ఉష గారు రాసే కవిత ల గురించి చెప్పే సాహసం చేయలేను. రెణ్ణెల్ల పైగా మూత పడ్డ  BOOKS AND GALFRIENDS (That's for some good reasons. Now coming back again with right content, and in a more crowded way. రెగ్యులర్ టపాలతో. Now we have very good content in all the things we want.) ని నా టైటిల్ పోస్ట్ తో ప్రారంభిద్దామనుకున్నా కాస్త సమయాభావం వల్ల ఆలశ్యం అయింది. ఈలోగా ఈ చక్కని కవిత. 

చేపా చేపా అంటూ నా మీద కథ కట్టి
అనగనగా అంటూ పాపతో ఊ కొట్టించి
ఏమయ్యా మనిషీ ఎన్నేళ్ళిలా?
విన్న నాకే వెగటాయే...
ఇక నేను ఓ కథ నీకు వినిపిస్తానిక

నేనున్న చెరువు నీళ్ళు మక్కువగా
మబ్బు రంగు పులుముకుని
ఒడ్డునున్న రాయి రప్పని ఒరుసుకుని
వెనక్కి ముందుకి వొళ్ళిరుసుకునే యేళ
నీలికళ్ళ చిన్నాడు వేటకనివచ్చినాడు

నా జతగాళ్ళు ఎగిసెగిసి పడి నవ్వినారు
ఏరా ఏరా ఎందుకు నవ్వినారంటే
చూడు చూడు అబ్బాయి వెనక చూడమనే
బంగారుఛాయ వొంటిదా ఆమె కురులదాన్నట్లు
చూడచక్కని చిన్నది వయ్యారి నడకల వచ్చినాది

పిలగాని చేయి గేలం నా వైపు విసిరితే
సొగసరి చూపు వల వాని వంక విసిరేను
చేత చిక్కిన నను చలాగ్గ తిరిగి నీట విసిరే ఆ యువ జాలరి
వోరకంట చిక్కిన చెలికాని పెదవి పంటి క్రింద నొక్కే నా సింగారి
ఇది కదా ఎప్పటి కథ అని నా జతగాళ్ళు మళ్ళీ కిసుక్కుమనే

ఈ సిత్రాలు చూడను చుక్కపొద్దాయే
సందమామ నడుమ సర్దుకుని కళ్ళిప్పి చూసేను
ఇసుక పక్క మీద ఆ పడుచుజంట చేయి చేయి కలిపి
కనుల వెన్నెల్లు, కబుర్ల తెమ్మెరలు కలబోసుకుని
వలపు వొలకబోస్తే చుక్కంటి ఓ చేపపడుచు నా వంక కనుగీటి నవ్వేను.


I thank ఉష గారు for giving BOOKS AND GALFRIENDS an excellent poem. Belated దసరా శుభాకాంక్షలు. 

గీతాచార్య    

Cool. We got the inspiration behind this sweet poem too. In the words of Usha garu,


One of our sub-contractors come on Fri to do fishing.  he catches and throws them back.  Last week he caught a foot long 1/2 foot wide fish, I took pic of it and we let it go in to waters.  that's it. His girl friend and him were enjoying after fishing on a moonlit night lying down on the sand I put to mimic a beach near the lake and it is so nice to observe them watching the skies and whisper to each other in smiles.  I am so spell bound for the magic of bonding two hearts make. A feel that I could see from the eyes of nature. Hence took fish to tell this on my behalf. 

Posted by గీతాచార్య Sep 29, 2009

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!