BOOKS ARE GALFRIENDS, AND GALFRIENDS ARE BOOKS. So much to learn...

ఫ్రెండ్ ద్వారా మెయిల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది...

Heart surgery free of cost for children (0 to 10 years).

For more information, 08028411500

Please let it be known to as many as possible in your circles. It may help those who are in need.

Information is not verifies still, but please give it a look

Posted by Srujana Ramanujan Nov 14, 2010


B&G పాఠకులకు, వ్రాతకులకూ మా అందరి తరఫునా దీపావళి శుభాకాంక్షలు. 
Just unleash the child within you this day,and make it memorable :)

Posted by గీతాచార్య Nov 4, 2010

నవ్వితే నవ్వండి అంటూ మనందరినీ నవ్వేట్టు చేస్తున్న బులుసు సుబ్రహ్మణ్యంగారు మీ సినిమా అనుభవం ఏదైనా చెప్పండి అంటే ఇదిగో ఇలా చెప్పారు.





నేను ఆనర్స్ ప్రీ ఫైనల్లో ఉండగా అంటే 1963 సంవత్సరం, నా రూమ్మేటు వీరేంద్ర చౌదరి వివాహం జరిగింది. నువ్వు తప్పకుండా రావాలిరా అని వాడు వేడుకోవడంవల్లా, వాళ్ళ నాన్నగారు ఇంతింత మీసాలు పెంచుకొని, కరుకుగా మాట్లాడుతూ పంతులూ నువ్వు రెండు రోజులు ముందర వచ్చెయ్యి అని ఆజ్ఞ జారిచేయడం వల్ల నేను ఆ పెళ్ళికి వెళ్ళేను ఒక రోజు ముందర. నేను వాళ్ళ ఊరు వెళ్ళడానికి సకల వాహనాలు ఉపయోగించ వలసి వచ్చింది. నిడదవోలు దాకా రైలు, ఆపైన బస్సు, ఆ తరవాత, రెండెడ్ల బండి ఎక్కి సుమారు మధ్యాహ్నం మూడు గంటలకు వాళ్ళ ఇల్లు చేరాను. నన్ను చూసి వాళ్ళ నాన్నగారు “ఆ వచ్చేసావా ?” అని అడిగేరు. నేను వచ్చినందుకు ఆనందించాడో, లేక మొహమాటానికి పిలుస్తే వచ్చేసాడేమిటి అన్న భావమో నాకు అర్ధంకాలేదు. “ఒరేయ్ రంగా! పంతుల్ని అబ్బాయి దగ్గరకు తీసుకెళ్ళు” అని చెప్పి వెళ్ళిపోయారు. రంగాగారు రండి మాష్టారు అంటూ నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళాడు.
అలాంటి ఇల్లు నేను అప్పటి దాకా చూడలేదు, పెద్ద హాలు. హాలుకి అరడజను గుమ్మాలు, వాటిలో గదులు. వాటిని దాటి వెళ్ళితే మధ్యన వరండా, మళ్ళీగదులు. ఈ గది లోంచి ఆ గదిలోకి పరుగు పెట్టే పిల్లలు, ఉంగరాలు లేని వేళ్ళు లేని వాళ్ళు, సిల్కు లాల్చీలు, సిల్కుపంచెలు ధరించిన మగవారు హడావిడి గా తిరిగేస్తున్నారు. పట్టు చీరలు కట్టుకొని, చీర కూడా కనిపించకుండా నగలు పెట్టేసుకొని, కదిలే మార్వాడీ కొట్టు లాగ అడుగులో అడుగు వేసుకుంటూ, బంగారం వాసన వేస్తూ తిరిగే మహిళామణుల మధ్య నించి, నన్ను లాక్కెళ్లి అబ్బాయి దగ్గర దిగపెట్టేడు. వచ్చావా, రా అన్నాడు అబ్బాయి. ఇంతలోనే ఓ పెద్ద ప్లేటు నిండా నాలుగు స్వీట్లు, అన్నేరకాల కారం పలహారాలు పట్టుకొచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఓ పెద్దమనిషి. అబ్బాయి చుట్టూ అమ్మలు, మధ్యలో అమ్మాయిలు పరాచికాలు, పగలబడి నవ్వడాలు. ప్లేటులోవి తినాలో, వాళ్ళ మాటలు వినాలో అర్ధం కావట్లేదు. అబ్బాయితో మాట్లాడటానికి కూడా సందు దొరకటంలేదు. సరేనని చేతిలోపని మీద దృష్టి పెట్టేను. ఎల్లాగో సందు చూసుకొని అబ్బాయి గారు నాదగ్గరికి వచ్చాడు.
“ఒరేయ్! నీ బస మా శాస్త్రి గారింట్లో ఏర్పాటు చేసారు నాన్నగారు. మా జనాల మధ్యన ఉండగలను అనుకుంటే ఇక్కడ ఉండు లేకపోతే అక్కడికి వెళ్ళు”. “ఒరేయ్ రంగా సార్ ని జాగ్రత్తగా చూసుకో”. పెళ్ళికొడుకు నాకు జాగ్రత్తలు చెప్పి మళ్ళీ ఆడవారి మధ్య కెళ్ళిపోయాడు. రంగా గారు అక్కడేఉన్న ఆడవారిని, అటూఇటూ తిరుగుతున్న మగవారిని పరిచయం చేస్తున్నాడు. నాకు ఆ బంగారం వెనకాల మనుషులు కనిపించడం లేదు.అంతా బంగారమే కనిపిస్తోంది. మీఇంట్లో ఘోషా ఉన్నట్టు ఉంది రంగా అన్నాను రంగా నవ్వేసాడు. రండి. మిమ్మల్ని శాస్త్రి గారింటికి తీసుకెళ్ళతాను అని నా బేగ్ భుజాన తగిలించుకుని బయల్దేరాడు.
ఓ ఐదు నిముషాలు, రెండు వీధులు తిరిగిం తర్వాత ఓ ఇంటి ముందు ఆగి శాస్త్రి గారూ అని పిలుస్తూ లోపలికి తీసుకు వెళ్ళాడు. టైము చూసాను అప్పుడే నాలుగు అయింది. ఈ ఊరు వచ్చి గంట దాటిందా అని ఆశ్చర్య పోయాను.
ఇంతలో శాస్త్రిగారు వచ్చారు లోపలి నించి.
“రా బాబూ కూర్చో” అన్నారు ఒక కుర్చీ నాముందుకు తోసి. నేను కూర్చున్నాను
“మీది భీమవరమా?”
నేను అవును అన్నట్టు తల ఊపాను
“చౌదరి గారి అబ్బాయి స్నేహితుడవా?”
“విశాఖపట్టణం లో కలసి చదువు కుంటున్నారా?”
“మీ నాన్న గారు తెలుగు పండితులా?”
“మీరిద్దరూ హాస్టల్లో ఒకే రూము లో ఉంటారా?”
నేను అన్నింటికి తలఊపాను. అన్నీ ఆయనకి తెలిసిన ప్రశ్నలే వేసారే అని ఆశ్చర్యపోయాను. నాభావం తెలుసుకున్న వాడై రంగా చెప్పాడు. మీ గురించి అబ్బాయి గారు అన్నీ చెప్పారు అన్నాడు. శాస్త్రిగారి భార్య కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది ఆవిడ కూడా అవే జవాబు అఖ్ఖర్లేని ప్రశ్నలు వేసింది. నేను షరా మామూలుగానే తలనూచాను.
“మొహమాటకు పడకు నాయనా. ఏమైనా కావల్సివస్తే అడుగు.” అని మళ్ళీ లొపలికి వెళ్ళి పోయింది ఆవిడ.
ఏమి అడగాలా అని ఆలోచిస్తుంటే, ఏదైనా అవసరం అనుకుంటే అడుగు నాయనా అని శాస్త్రి గారు వీధిలోకి వెళ్ళారు. ఇప్పుడు అనుమానం వచ్చేసింది. అవసరం అంటే ఏమిటీ అని ఆలోచించడం మొదలు పెట్టాను. “మీరు ఏమీ ఆలోచించకండి. మై హూ హై” అన్నాడు రంగా. “ఈ మధ్యనే హిందీ నేర్చేసుకుంటున్నాను. బొంబాయి వెళ్ళాలి”అన్నాడు రంగా. నేనేం మాట్లాడలేదు. మళ్ళీ హిందీ లో వాయించేస్తాడని. మనకి బొత్తిగా అర్ధంకాని భాష అది. ఇంగ్లీషు సినిమా లైనా కొంచెం అర్ధం అవుతాయేమో కాని హింది అసలు నహీ. “సరే సార్ మీరు ఓ గంట విశ్రాంతి తీసుకోండి. నేను మళ్ళీ వస్తాను” అని చక్కాపోయాడు.

సరే అని నేను మంచం మీద నడ్డి వాలుద్దామనుకుంటుంటే, శాస్త్రి గారి భార్య వచ్చేసింది. మాఊరు వాళ్ళ ఊరూ దగ్గరే అని కనిపెట్టేసి మాఅమ్మ వాళ్ల గురించి, నాన్న వాళ్ల గురించి, మా గోత్రాలు, ఋషులు మొదలగు వారిగురించి కూలంకషంగా చర్చించి, ఔఇంకా పెళ్ళి ఎందుకు కాలేదు నాయనా?” అని అడిగేసింది ఆవిడ. అప్పుడే తొందరేమండి. “ఇంకా చిన్న వాడినే గదా” అని అన్నాను. “అయ్యో అదేమిటి నాయనా! నీవయసు లో ఈయన మా మామగారిని తాతని చేసేసారు”. నాకు అర్ధం కాలేదు. ఆవిడ నవ్వింది. మట్టి బుర్ర ఆప్పుడు అర్ధం అయింది. ఇక్కడే ఉంటే ఈవిడ నాకు సంబంధాలు చూస్తుందేమోనని భయం వేసింది ఊరు చూసోస్తానని ఆవిడ కి చెప్పి బయట పడ్డా. అన్ని పల్లెటూర్ల లాగే ఉంది. పచ్చగా, హాయిగా చల్లగాలి వీస్తోంటే మెల్లగా నడుచుకుంటూ వెడుతున్నాను

రెండు వీధులు తిరిగే టప్పటికి రంగా వచ్చేసాడు. “అప్పుడే బోరు కొట్టేసిందా మాఉరు అంటూ “రండి ఆచివర సినిమా హాల్ ఉంది. అందులో కూర్చుందురు గాని మంచి కాలక్షేపం” అన్నాడు. ”ఇప్పుడా?” అన్నాను టైము చూస్తూ ఐదు అయింది. “ఇంకో గంటన్నర ఆట ఉంటుందండి. ఏదో పేరు చెప్పేడు జానపద సినిమా” అన్నాడు. హాల్ మనదే అన్నాడు. సరే ఆవిడ తో కబుర్ల కన్నాఇదే మంచిది అనుకొని “టూరింగ్ టాకిసా?” అని అడిగాను . “కాదండి ఫుల్ సినిమా హాల్” అన్నాడు. నాకు అర్ధం కాలేదు. “మీ పట్నం లాగానేనండి. సిమెంటు బిల్డింగ్, నేలా, బెంచి, కుర్చీ, రిజర్వుడు పైగా బాల్కని కూడా ఉందండి. ఈ చుట్టుపక్కల పదిహేను ఊర్లకి ఇదే పెద్ద సెంటరండి సినిమాలకి . చుట్టుపక్కల ఊళ్ళలో నాలుగు టూరింగ్ టాకీసు లున్నాయండి మన ఊర్లోనే ఫుల్ సినిమా హాలండి. మూడు అభిమాన సంఘాలున్నాయండి మా ఊర్లో”. అని అడగకుండానే ఆ సినిమా హాలు హిస్టరీ మొత్తం చెప్పేసాడు. “అబ్బో పెద్ద చరిత్రే ఉందే మీ ఊరుకి” అన్నాను. “అప్పుడప్పుడు కొత్తసినిమాలు కూడా వస్తాయండి విడుదలయిన నెలరోజుల్లో”. ఆహా అన్నాను. ఇంతలో హాలు దగ్గరికి వచ్చేసాం. నన్ను తీసుకెళ్ళి బాల్కనీ లో కూర్చో పెట్టేడు. నేను మళ్ళి సినిమా అయేటప్పటికి వస్తానండి అని వెళ్లి పోయాడు.

నేను కూర్చుని చుట్టుపక్కల సర్వే చేసాను.మొత్తం 12 సీట్లు ఉన్నాయి మొదటి వరుస మూడు, రెండోవరుసలో నాలుగు, మూడో వరుస లో ఐదు ఉన్నాయి.చివరి వరుసలో నలుగురు కూర్చున్నారు. రెండో వరుసలో ముగ్గురు ఉన్నారు. మొదటి వరుసలో నేను మధ్య సీటులో ఫాన్ కింద కూర్చున్నాను. తెరమీదకి చూసాను. రాజుగారు గుఱ్ఱం మీద, వెనకాల సైనికులు గుఱ్ఱాల మీద, కాల్బంటులు, శూలాలు, గదలు, కత్తులు పట్టుకొని పరుగెడుతున్నారు. వెనకాల సంగీతము దడదడ లాడించేస్తోంది. వ్యతిరేక దిశలో ఇంకో రాజు గారు అంతమంది సైనికులతో వచ్చేస్తున్నారు. సరిగ్గా అదే టైము లో నాపక్కన రెండు సీట్లలో ఇద్దరువచ్చి కూర్చున్నారు. కొద్దిగా మందు వాసన వేస్తోంది. “యుద్ధం మొదలవుతోందిరా” అన్నాడు ఒకడు. “సిగతరగా! నిన్నా ఇదే టైముకి వచ్చాం రా” అన్నాడు ఇంకోడు. రెండు సైన్యాలు ఒకరి కెదురుగా ఇంకోరు పరిగెడుతున్నారు.

ఒకడు: అబ్బాయి గారి స్నేహితుడు గారు రా
రెండో వాడు: అవును రా సినిమాకు వచ్చినట్టున్నారు.
సినిమాలో సైన్యాలు పరిగెత్తేస్తున్నాయి.
ఒ: పావుగంట ముందు వస్తే పాట వినేవాళ్ళం గదా
రెం: ఇంకో పాట ఇప్పుడు వస్తుంది గదా
సి: రెండు సైన్యాలు ఒక దాని ఎదురుగా ఒకటి నిల్చున్నాయి.
నేను జేబు లోంచి సిగరెట్టు తీసి వెలిగించాను.
ఒ: ఫ్రెండుగారు సిగరెట్లు కాలుస్తారనుకుంటాను రా
రెం: అబ్బాయి గారు కూడా కాలుస్తారాండి
నే: కాలుస్తాడండి
సి: ఇద్దరు రాజులు కత్తులు దూసారు
ఒ:, రెం:, చుట్టలు వెలిగించారు
సి: రాజులెక్కిన గుఱ్ఱాలు గుండ్రంగా పరిగెడుతున్నాయి.
నే: ఉత్సాహంగా చూస్తున్నాను ఎప్పుడు యుద్ధం మొదలవుతుందా అని
గుఱ్ఱాలు ఆగాయి.రాజు ఒకటికి రాజు రెండుకి ఓ ఇరవైగజాల దూరం
ఒ.రా: ఓరోరి దురాత్మా!. కదనమున నన్ను గెలవగలవా?
రె.రా:నీచా! దుష్టా! నీ పొగరణచెద కాచుకొమ్ము
ఒ: ఈళ్ళిప్పుడు ఇంకో పది మాటల యుద్ధం చేస్తారండి. అప్పుడు కత్తి యుద్ధం మొదలు
రె: అబ్బాయి గోరు అవి నిజంకత్తులేనంటారా
ఒ.: నీ మొహం. నిజంకత్తులైతే చస్తారు. అట్ట కత్తులు
రె: సౌండ్ వస్తుంది కదరా
ఒ: అది ఎనకాల మూజిక్ రా
సి: కత్తి యుద్ధం మొదలయింది టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
చేగోడీలు చేగోడీలు మధ్యలో అమ్మేవాడు రంగప్రవేశం
ఒ: అర్ధరూపాయివి ఇవ్వరా
వాడు ఇచ్చాడు వీళ్ళు నమలడం మొదలు పెట్టారు. రెండు చెవుల్లోను కర్ ఖర్ ఖ్ఖర్
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ: ఇప్పుడు ఆడి పెళ్ళాం ఈడి పెళ్ళాం పాట పాడుతారు డూయెట్టు
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కరుణించుమా కనకదుర్గా నా నాధుని గెలిపింపుమా
రె.రా.పె.: కాపాడుమా పరమేశ్వరా నాపతికి జయము నీయుమా
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ.: పరమేస్వరుడు గెలుస్తాడా పార్వతీ దేవి గెలుస్తుందా
నే: నిన్న చూసారుగా. మీకు తెలిసే ఉండాలి కదా
రె.: నిన్న సరిగ్గా పాట అయేటప్పటికి కరెంటు పోయింది
టంగ్ టంగ్ టటంగ్ టంగ్ టంగ్ టటంగ్ టంగ్
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కరుణించుమా కనకదుర్గా ఆఆఆఆ ఆఆఆఆ
రె.రా.పె.: కాపాడుమా పరమేశ్వరా ఆఆఆఆ ఆఆఆఆ
ఇంతలో ఒ.రా. చేతిలో కత్తి విరిగిపోతుంది. ఒ.రా దొర్లుకుంటూ ,రె.రా కత్తి విసురుతూ, దొర్లుకుంటూ, విసురుతూ ఒక నది దగ్గరకు వచ్చేస్తారు. నదికి ఒక తాళ్ళ వంతెన ఉంటుంది.
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కరుణించుమా స సా రి రీ రిర్రీ గగ్గా గ్గాఆఅ పదనిస పాదానీసా
రె.రా.పె.: కాపాడుమా గా గా పాప్పానా న్నా అమామ్మామాపాదనిసాఆఆ
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఇక్కడ ఒ.రా రె.రా లు వంతెన మీద యుద్ధం ఒ.రా, రె. రా చేతిలో కత్తి ఎగర కొట్టేస్తాడు. ఇద్దరు ముష్టి యుద్ధం మొదలు పెడతారు.
ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ:రా.పె.: కనకదుర్గా
రె.రా.పె.: పరమేశ్వరా
ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం ఢుషుం
అప్పుడు రె.రా నీళ్ళలో పడిపోతాడు. ఒ.రా నీళ్ళలోకి దూకేస్తాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి
ఢుషుం ఢుషుం బుడుంగ్ బుడుంగ్ ఢుషుం ఢుషుం బుడుంగ్ బుడుంగ్ ఢుషుం
కర్ ఖర్ ఖ్ఖర్ కర్ ఖర్ ఖ్ఖర్
ఒ.రా.పె.: కరుణించుమా
రె.రా.పె.: పరమేశ్వరా
ఇంతలో రెండు మొసళ్ళు నీళ్ళలో కొట్టుకుంటున్న వారి దగ్గరగా వచ్చి ఘ్ర్యీ: ఘ్ర్యీ: అంటాయి
ఒ.రా.పె.: కనక దుర్గా దుర్గా దుర్గా ఆఆఆఆఆఅ
రె.రా.పె.: కాపాడుమా మా మాఆఆఆఆఆఆఆ
రె.రాపె గారి దగ్గర ప్రమిద ఆరిపొతుంది. ఒరా గారి దీపం ఆరి, వెలిగి, వెలిగి ఆరిపోయేటట్టు ఉన్నట్టుంటే కరెంటు పొతుంది.
రె.: సిగతరగా, సరిగ్గా నిన్నా ఇక్కడే కరంటు పొయిందండి.
ఒ.: ఇప్పుడు ఏమవుతుందండీ అబ్బయి గొరూ,
నే.: నాకు తెలియదు ఈ సినీమా నేను చూడలేదు
రె.: మీరు డైట్రు అయితే ఏం చేస్తారు
నే.: రెండో దీపం కూడా ఆర్పేస్తాను.రెండు మొసళ్ళూ ఇద్దరిని తినేస్తాయి. ఇద్దరు పెళ్ళాలు ఆత్మహత్య చేసుకుంటారు. అప్పుడు రెండు రాజ్యాలలో ప్రజలు సుఖంగా జీవిస్తారు.
హహహహహ్హహ్హహ్హ అని ఘట్టిగా నవ్వి నేను అక్కడనించి పారిపోయాను.

Posted by జ్యోతి Oct 31, 2010

మాలా కుమార్ గారి గురించి ప్రత్యేకంగా మన B&G పాఠకులకి పరిచయం చెయ్యక్కర్లేదు. అందరూ అమెరికా వెళ్ళి అవి చూశాము, ఇవి చూశాము, అక్కడ ఇలా... ఇక్కడ ఇలా అని కబుర్లు చెపుతారు. మాల గారు మాత్రం ఒక టచీ విషయం చెప్పారు. అమెరికా అనగానే వారికి గుర్తొచ్చే అంశం!

చదవండిక్కడ...

మా మనవరాలు అదితి కి వంట్లో బాగాలేదు అంటే చూద్దామని , రెండోసారి ( మొదటి సారి అదితి పుట్టినప్పుడు వెళ్ళాను )  , అట్లాంటా ( అమెరికా ) కు వెళ్ళాను . నేను వెళ్ళిన మూడు నెలల తరువాత , మా వారు పిల్లల బలవంతము మీద ఒక నెలరోజులుందామని మొదటిసారి అమెరికాకు , వచ్చారు . ఆయన వస్తున్నరోజు , హంట్స్ విల్లే నుండి , మా అబ్బాయి , కోడలు అట్లాంటాకు వచ్చారు . మా అబ్బాయి ని రెండు సంవత్సరాల తరువాత , మావారు చూడటము అప్పుడే ! ఏర్ పోర్ట్ నుండి ఇంటికి రాగానే , మా వారు సూట్ కేస్ లు విప్పుతుంటే అందరూ , చాలా క్యూరియస్ గా ఎవరికే బహుమతులు తెచ్చారా అని చూస్తున్నారు . ఒక సూట్కేస్ నిండా స్వీట్ బాక్స్ లు ! ఇన్ని స్వీట్స్ తెచ్చారేమిటీ అంటే అవి మనవి కాదు , మా ఫ్రెండ్స్ , వాళ్ళ పిల్లలకు ఇవ్వమన్నవి అని రెండో సూట్కేస్ లో నుండి కూడా కొన్ని స్వీట్ బాక్స్ లు తీసి అవి మనకు అని ఇచ్చారు . సరే పిల్లలందరికీ తలా ఒక కానుక ఇచ్చారు . సూట్కేస్ ఖాళీ ! అసలు మీ బట్టలేవండీ ????? అని నేనడుగుతే పాపం అప్పుడు చూసుకున్నారు తన వస్తువులేవీ తెచ్చుకోలేదని ! మరునాడు ఉదయమే బిపు ఆయనను తీసుకెళ్ళి , కావలసినవి కొని ఇచ్చి , ఆయన తెచ్చిన స్వీట్స్ అన్నీ పాక్ చేసి , ఎవరివి వాళ్ళకు పంపి , నేను ఫ్రైడే వచ్చి మిమ్మలిని హంట్స్ విల్లే తీసుకెళుతాను అని , మినియాపూలీస్ కు టూర్ మీద వెళ్ళాడు .

ఫ్రై డే మద్యాహనం ఏ అన్నీ సద్దేసుకొన్నాము . వచ్చి నాలుగు రోజులే కదా అయ్యింది , నెక్స్ట్ వీక్ వెళుదురుగాని అని మా అమ్మాయి కాస్త గునిసింది . ఇక్కడ స్నో చాలా పడుతోంది , ఫ్లైట్స్ అన్ని కాన్సిల్ అయ్యాయి రేపు పొద్దున్నే వస్తానని బిపు కాల్ చేసి చెప్పాడు . సరే , సాయం కాలము కాసేపు తిరిగి వచ్చి పడుకున్నాము . మద్యరాత్రి మా మనవరాలు ఏడుస్తుంటే పాలు కలుపుదామని లేచాను . ఫోన్ లో ఆన్సరింగ్ మిషిన్ బీప్ . . . బీప్ అంటోంది . చూస్తే , మా మరిదిగారి మెసేజ్  , అన్నయ్యా నీతో మాట్లాడాలి అర్జెంట్ అని వినిపించింది . వెంటనే మా వారిని లేపాను . ఆయన ఇండియాకు కాల్ చేసారు . మా ఆడపడుచు విజయ లిఫ్ట్ చేసింది . ఏటమ్మా విజయా , వెంకట్ ఫోన్ చేసాడు అంటే , నాన్న తో మాట్లాడు అన్నయ్యా అని , మా మామగారికి ఇచ్చింది . మాధవా అమ్మకు వంట్లో బాగాలేదురా , కోడలిని తీసుకొని వెంటనే బయిలుదేరి రా అన్నారు , మా మామగారు . మళ్ళీ ఇద్దరూ రండి , నువ్వొక్కడివే కాదు అన్నారు . ఏమైంది నాన్నా అంటే మీరు రండి , అమ్మకు చాలా సీరియస్ గా వుంది అన్నారు . అంతే , ఎవరికీ ఏమి మాట్లాడాలో తెలీలేదు . మా అమ్మాయి సంజు వెంటనే , ఫ్లైట్ టికెట్స్ కోసం ప్రయత్నం మొదలు పెట్టింది . మేము వచ్చిన కోరియన్ ఏర్లైన్స్ ఆ రోజు లేదు . తను టికెట్స్ కోసం ప్రయత్నము లో వుంది . మావారేమో మాటా పలుకూ లేకుండా నిశబ్ధం గా వున్నారు .  ఎట్టకేలకు డెల్టా ఏర్లైన్స్ లో 5000$ తో దొరికాయి !

అప్పటికి తెల్లవారుఝాము నాలుగైంది . టికెట్స్ దొరికాయి , బయిలుదేరుతున్నారు అని మామాగారికి చెప్పింది సంజు . అప్పుడు , మావారు ఫోన్ తీసుకొని , నాన్నా అమ్మతో ఒక్కసారి మాట్లాడుతాను , అమ్మకివ్వు ఫోన్ అన్నారు . మా అత్తగారు ఫోన్లో చిన్నగా  ' మాధవా ' ' మాధవా ' అని రెండుసార్లు పిలవటము స్పీకర్ల లో నుండి వినిపించింది అమ్మా నేను వస్తున్నాను ఎక్కడికీ వెళ్ళకమ్మా అని ఘట్టిగా ఏడ్చేశారు . మా అందరికీ కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి .  ఓ పదినిమిషాలకు మా అత్తగారు ఇకలేరు అన్న వార్త తెలిసింది .  ఆవిడ గొంతు విన్నప్పుడు , పరవాలేదేమో అనుకున్నాము , కాని అదే ఆవిడ చివరి మాట అని తెలుసుకోలేక పోయాము .

సారీ డాడీ సారీ , నిన్ను రమ్మని బలవంతము చేయక పోతే బామ్మ దగ్గరే వుండే వాడివేమో అని సంజు వల వలా ఏడ్చేసింది . అవును . . . మావారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో వుండగా , చైనా వార్ లో వెళ్ళేందుకు , చదువు వదిలేసి ఆర్మీ లో షార్ట్ సర్వీస్ కమీషండ్ ఆఫీసర్ గా చేరారట . అప్పుడు మా అత్తగారు ఎంతచెప్పినా , మన అవసరమున్నప్పుడే మాతృభూమికి సేవ చేయాలి అని యుద్ధానికి వెళ్ళారుట . ఇంజనీర్ అవుతాడనుకుంటే ,  మొండివాడు ఎంతబతిమిలాడినా వినకుండా వెళ్ళాడు అని మా అత్తగారు ఎప్పుడూ అనేవారు .  మేము బరోడాలో వుండగా , మావారు , రాజస్తాన్ లో ఎక్సర్సైజ్ కు వెళ్ళినప్పుడు , మా అత్తగారు చాలా సీరియస్ అయ్యారు . ఆయన వెళ్ళింది బార్డర్ కు . అక్కడికి వార్త చేరటము కష్టం . ఆ రోజులలో , మొబైల్ ఫోన్ లు కాదు  ఇళ్ళలోనే లాండ్ ఫోన్ లు కూడా వుండేవికావు . యూనిట్ నుండి వార్త వెళ్ళాలి . మేము చేద్దామన్నా వీలుకాని పరిస్తితి . అసలు నాకూ ఆ వార్త అందలేదు ! మావారు పదిహేను రోజుల తరువాత తిరిగి వచ్చాక తెలిసింది . అంతే వెంటనే వెళ్ళారు . ఈయనను చూడగానే , అదృష్టవసాత్తు , అప్పటికే కోలుకొన్న మా అత్తగారు , ఇక నువ్వు హైదరాబాద్  వచ్చేయరా మాధవా అని భోరున ఏడ్చేసారుట . బరోడా రాగానే వాలంటరీకోసం అప్లై చేసారు . ఆయన సీ. ఓ  ఇంటికి వచ్చి మరీ , నువ్వు లెఫ్ట్ నెంట్ కల్నల్ గా అప్ర్రూవ్ అయ్యావు  , ప్రమోషన్ తీసుకొని ఆజ్ ఏ కల్నల్ గా రిటైర్ అవ్వచ్చుకదా అని నచ్చ చెప్పారు . కాని , ఇప్పుడు ప్రమోషన్ తీసుకుంటే ఇంకో రెండు సంవత్సరాలుండాలి , అప్పటి వరకు నేనుండలేను , అమ్మ కోసం వెళ్ళాల్సిందే అని ఆర్మీ వదిలి హైదరాబాద్ వచ్చేసారు .  జన్మభూమికి అవసరమైనప్పుడు  , చదువును మధ్యలోనే వదిలేసి 19 సంవత్సరాల వయసులోనే ఆర్మీలో చేరారు . జనని కి అవసరము అనుకున్నప్పుడు ,  వచ్చిన ప్రమోషన్ ను తృణప్రాయముగా వదులుకొన్నారు . ఇప్పటికీ ఆయన ఆర్మీ ఫ్రెండ్స్ అంటూ వుంటారు , నువ్వు వాలెంటరీ తీసుకోకపోతే బ్రిగేడియర్ వి అయ్యేవాడివి అని .  ఆ రోజు నుండి నాలుగు రోజుల క్రితం అట్లాంటా వచ్చేవరకూ అమ్మను కనిపెట్టుకొనే వున్నారు . విధివిలాసం . . . . . వెళ్ళి పిల్లల దగ్గర కొన్ని రోజులు గడిపిరమ్మని పంపిన అమ్మ అంత అకస్మాతుగా వెళ్ళి పోవటము ఆయనకు చాలా పెద్ద షాక్ . . .    

మేము చెక్ ఇన్ అవుతుండగా బిపు వురుకులు పరుగులు మీద వచ్చాడు . చాలా భారమైన గుండెలతో బయిలు దేరాము . హైదరాబాద్ ఎలా చేరామో తెలీదు . ఇంటికి రాగానే వాకిట్లో బల్ల మీద , పచ్చని మోములో ఎర్రని కుంకుమతో , ఆకుపచ్చని గుంటూరు జరీ చీర తో మెరిసిపోతూ పడుకొని వున్నది మా అత్తగారి పార్ధివ శరీరము అంటే నమ్మకము కలగ లేదు . 84 సంవత్సరాల పండు ముత్తైదువ , అని చూసేందుకు , ఆమె కాళ్ళకు నమస్కరించేందుకు మొత్తం బర్కత్ పురా వాసులంతా తరలివచ్చారా అన్నట్లుగా మనుషులు కిట కిట లాడుతూ వున్నారు  . ఎవరెవరెవరో తెలియని వాళ్ళు కూడా  బుట్టల కొద్ది , పూలు , పసుపు కుంకుమ తెచ్చి , చల్లి నమస్కరించి వెళుతున్నారు .  విష్ణుసహస్రనామము పారాయణ చేస్తుండగా , చివరిసారిగా ప్రియ కుమారుడితో  , కావాలని పెట్టుకున్న పేరు , ' మాధవా , మాధవా ' (అసలు పేరు ప్రభాత్ ఐనా , ఇంట్లో మావారిని మాధవ అనే పిలుస్తారు )  అని పిలిచి మాట్లాడి వెళ్ళిపోయారు . ఎంత పుణ్యాత్మురాలో అని అందరూ కీర్తించటమే . ' చావు కూడా పెళ్ళి లాంటిదే ' అనేది నిజమే అనిపించింది .  

అమెరికాకు నాలుగు సార్లు వెళ్ళినా ఎవరైనా మీ అమెరికా అనుభవం చెప్పండి అంటే నాకు అప్రయత్నముగా ఇదే గుర్తొస్తుంది .

Posted by Srujana Ramanujan Oct 28, 2010

ఒకసారి పేపర్లో న్యూస్ చూసి అలాగే కూచుండిపోయాను. లినెట్ వచ్చి పిలిచిందాకా అందులో చూసిన విషయం గురించే నా ఆలోచన. అసలు ఆటగాళ్ళు దేని కోసమని ఆడుతారు? దేనికోసమని ఆడాలి? 

డబ్బా? పేరా? అభిమానులకోసమనా? ఆత్మ తృప్తికోసమనా? ఇవేవీ కాకుండా మరేదైనా ఉన్నదా? 

ఒక ఇండియన్ క్రికెట్ అభిమాని తల పగిలి రక్తం కారుతున్న ఫొటో నేనప్పుడు చూసింది. క్రికెట్ కోసం గంగవెర్రులెత్తే జనమున్న దేశమది. క్రికెట్ ఒక మతం, క్రికెట్ ఒక భాష, క్రికెట్ ఒక జీవన విధానం. కులం కోసమనీ, మతం గురించనీ, డబ్బూ హోదాల తేడాలున్నా కూడా "స్కోరెంత?" అన్న ఒక్క మాట మాత్రం అందరినీ ఒక్కటిగా చేస్తుంది. 

ఉక్కబోత వాతావరణం, విపరీతమైన హ్యుమిడిటీ, కడుపెప్పుడు ఖరాబెప్పుడౌతుందో తెలియని పరిస్థితులు, అబ్బో, తొలిసారి అక్కడికి వెళ్ళినప్పుడు మహా ఇబ్బందులెదురయ్యాయి. డీన్ (జోన్స్) కొట్టిన రెండొందల (విఖ్యాత టైడ్ టెస్ట్) గురించి మేమిప్పటికీ ఎందుకంత గొప్పగా చెప్తామంటే ఆ పరిస్థితులలాంటివి మరి. రాను రానూ పరిస్థితులు మారాయి. కానీ ఇక్కడి అభిమాన జనం, వారి ఆశల్లో మాత్రం మార్పులేదు. 

ఆటంటే వారికి ప్రాణం. క్రికెట్ ని ఇంతలా అభిమానించిన వాళ్ళు వేరెక్కడా నాకు కనబడలేదు. వారి ఆ అభిమానమే నాకు వారంటే గౌరవభావాన్ని పెంపొందించింది. దెబ్బలు తిని ఏడ్చుకుంటూ వెళ్ళే అభిమానుల్ని చూసే ఉంటాను. క్తమోడేలా కొట్టే పోలీసుల్నీ చూసి ఉండొచ్చు. కానీ ఆ కుర్రాడిని చూసినప్పుడు కలిగిన ఆవేదన మాత్రం వర్ణనాతీతం. నెత్తి మీద జుట్టుతో ఇండియా బొమ్మ హెయిర్ స్టైల్. త్రివర్ణాలున్నాయి.

ఎందుకు వాళ్ళు అంత తయారయి వచ్చేది? గుర్తింపు కోసమా? ఆట మీద మోజుతోనా? సరదా కోసమా? 

తమ జట్టు గెలిస్తే చూడాలని. తమ అభిమాన ఆటగాడు సెంచురీలు కొడితే చూడాలని, వికెట్లు పడగొడితే కేరింతలు కొట్టాలని. అంత ఖర్చు పెట్టుకుని వస్తున్నది స్టేడియాలకు, తమ జట్టు గెలిస్తే చూడాలని మాత్రమే. ఓడిపోవటమ్మీద వారికసలు ఆలోచన ఉండదు. కేవలం తమ జట్టు గెలవటమ్మీద మాత్రమే వారి దృష్టి. 

అలాంటి అభిమానుల్ని, వారి ఆలోచనలని చూస్తే మేము ఆడాల్సింది కేవలం గెలవటానికే. ఆడినా, ఓడినా మా డబ్బు మాకొస్తుంది. మా జీవితమే క్రికెట్. మాకది తప్ప వేరే లోకం లేదు. కానీ వారికి? వారి జీవితాలున్నాయియి. వారి పన్లున్నాయి. కానీ, అవన్నీ మానుకుని, కేవలం మా కోసం... అంటే తమ అభిమాన ఆటగాళ్ళ కోసం వారు స్టేడియాలకు తరలి వస్తారు. మేము గెలవాలనే.

అందుకనే నేను ఆడేప్పుడు, ఓటమి అంచున ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆ అభిమానులూ, వారి ఆకాంక్షలు. డబ్బే ప్రధానం కాదు. ఒక ఎలక్ట్రానిక్ గా౨డ్జెట్ను కొనే ముందు ఎన్నో ఆరాలు తీస్తాము. పెర్ఫామెన్స్ బాగుంటుందా లేదా అని వంద ప్రశ్నలు వేస్తాము. పెట్టిన ప్రతి డాలర్కూ ఫలితాన్ని పొందగలిగామా లేదా అని ఆలోచిస్తాము. సంవత్సరాలు తీసే సినిమాల భవితవ్యాన్ని కేవలం ఒక్క క్షణంలో తేలుస్తాము. ఎందుకు పెట్టిన పైసకు తగిన పతిఫలం ముట్టిందా లేదా అని. మరలాంటిది మేము ఆడినప్పుడు చూడాలని వచ్చిన జనం పెట్టిన ఖర్చుకు ప్రతిఫలాన్ని ఇస్తున్నామా? 

నా దగ్గరకు వచ్చే యువ ఆటగాళ్ళకు నేను ఈ ఫొటోనే చూపుతాను. పేరూ డబ్బూ సరే, వాటంతట అవే వస్తాయి. కానీ, అభిమానులు వచ్చేది మాత్రం మనం గెలిస్తే చూడాలని మాత్రమే. అందుకే ఆడాల్సింది కేవలం గెలవటానికి మాత్రమే. గెలవాలంటే మనమాడాల్సింది తిరుగు లేని విధంగా. తిరుగులేని ఆటగాడంటే ఎవరికైనా గౌరవమే. అందుకే Play to win. Rest follows. రక్తం ఓడుతున్న ఆ అభిమానిని గుర్తుకు తెచ్చుకోండి. టికెట్ కోసమతను పడ్డ కష్టాన్ని గురించి ఆలోచించండి. ఎండనకా, ఆననకా అతను క్యూలలో నిలబడి మరీ వచ్చేదెందుకా అని ఒక్క క్షణమాలోచించండి. తన విలువైన సమయాన్ని వృధా చేసుకునేది, ఒక విజయాన్ని చూడాలని మాత్రమే. ఆ ప్రతిఫలాన్ని అతనికి దక్కించండి. 

మరి మా తృప్తో అంటారా? గెలవటంలో ఉన్న తృప్తి డబ్బు వల్ల కూడా రాదు. అయినా ఆ విషయాలను మళ్ళా కలిసినప్పుడు...

(ఈసారి సెహ్వాగ్స్ 195).

This one is abridged slightly. Full version in English will be published later :)



Posted by గీతాచార్య Oct 22, 2010

మన క్రికెట్ చంటి గాడు, టెస్ట్ క్రికెటరాఫ్ ద యియర్ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టిన రోజివాళ.



ఓపాలి ఇషింగులు సెప్పుకుందామా?

ఈ సంవత్సరమ్మొత్తం ఇరక్కుమ్మాలని కోరుకుంటూ...

Posted by గీతాచార్య Oct 20, 2010


బ్లాగర్ తృష్ణ గారు దసరా శుభాకాంక్షలు చెప్తూ పెట్టిన స్కెచ్ బాగుందనిపించింది. అందుకే అలంటిదేదన్నా ఉంటే B&G కోసమని ఇవ్వమని అడిగాను. వెంటనే ఈ స్కెచ్ గీసి పంపారు. Woman in curves...


చూసి ఎలా ఉన్నదో చెప్పండి... :)

మదిలో ఆలోచనల సుడి గాలి
రేపిందొక వడ గాలి

ప్రశ్నల మీద ప్రశ్నలు
సమాధానాల నెవరి నడగాలి?

జవాబు దొరకక తిరుగుతున్న నాకు 
కనిపించిందొక అంగన
కలిగించింది సాంత్వన
చూపింది నా ఆలోచనలకొక పొంతన

పేరడిగాను
అన్నది కదా...

తెలియదా నేనెవరో
అవుతానా వేరెవరో
నీ అంతరంగాన్ని
అనంత జీవన సారాన్ని


అంటూ మొదలయ్యే నా "ప్రశ్నాంగన" అనే కవితకు చక్కగా సరిపోతుందీ స్కెచ్. అందుకే ఇక్కడ కవిత మొదలునిస్తున్నాను.

అడిగిన వెంటనే స్పందించి చక్కని స్కెచ్ నిచ్చిన తృష్ణ గారికి ధన్యవాదాలు. ThankQ Sis

Posted by గీతాచార్య Oct 19, 2010

రచన : మాకినీడి సూర్య భాస్కర్

కథాస్వామ్యం, గోదావరి స్టేషన్, సామెత కథల వంటి సొంత కథలను సంపుటాలుగా వేసిన ప్రసిద్ధ అనువాద కథకులు ఎల్. ఆర్. స్వామి - మలయాళంలో పుట్టి, తెలుగులో ఉద్యోగించిన జీవితాన్ని తన ప్రవృత్తికి అన్వయిస్తూ మలయాళం నుండి తెలుగులోకి, తెలుగు నుండి మలయాళం లోనికి అనేక రచనల్ని అనువదించారు. తమిళం నుండి తెలుగులోకి కూడా కొన్ని అనువాదాలు చేశారు. అనువాద రచయితగా వీరి ప్రాచుర్యం ఎంతటిదంటే, కేంద్ర సాహిత్య అకాడమీ స్వయంగా పూనుకుని వీరి చేత కొన్ని గ్రంథాల్ని అనువదింప జేసింది. అనువాద కథకునిగా ఎంత పేరు పడ్డారో సొంత ముద్ర కలిగిన స్వీయ కథలకూ అంతే పేరు పొందారు, స్వామి.

తెలుగులో స్వామి రచనా నేపథ్యానికి ఆరంభం మాత్రం గొప్ప విస్మయాన్ని కలిగించే సంఘటన. తెలుగు మాతృభాష కాకపోయినా, ఉద్యోగరీత్యా 1980ల్లో విశాఖ వచ్చి స్థిరపడ్డ కారణంగా తెలుగు నేర్చుకుని తెలుగు సాహిత్యాన్ని చదివారు స్వామి. ఓ ప్రముఖ వార పత్రిక పోటీలో బహుమతి పొందిన ఓ కథ గురించి చర్చించు కుంటున్న సహోద్యోగులతో, విభేదించిన కారణంగా మాటా మాటా పెరిగి, సత్తా ఉంటే కథ రాసి చూపమనే సవాలుగా పరిణమించడం వల్ల తప్పనిసరిగా రాయాల్సిన అవసరంలోంచి 20 ఫిబ్రవరి 1988 న పుట్టుకొచ్చింది , ఆయన మొదటి తెలుగు కథ 'జవాబు లేని ఒక ప్రశ్న'గా స్వామి కలం నుంచి. అంతే కాక, ఆంద్ర జ్యోతి వార పత్రిక ఉగాది కథల పోటీలో బహుమతి కూడా పొందింది. అయితే, స్వామి అప్పటికే మలయాళంలో గుర్తింపు పొందిన రచయిత అని పాపం వారి సహోద్యోగులకు తెలిసి ఉండదు. ఏమైనా వారిని అబినందించాలి, తెలియక చేసినా మంచి పని చేసినందుకు; మంచి అనువాదకున్ని తెలుగు సాహిత్యానికి అందించినందుకు.

ఒకటి రెండు సంఘటనలతో లోకరీతిని అద్భుతంగా చిత్రీకరించగల నేర్పుతో కథను సాధ్యమైనంత సంక్షిప్తంగా రాయగల శిల్పాన్ని సంతరించుకున్న స్వామి ప్రయోగవాది కూడా. జీవిత సారాన్ని ఏరి, కూరిన సామెతల ఆధారంగా మంచి కథ లల్లారు స్వామి. అయితే ఆ కథలు ఏదో ఒక సామెతను ఎంచుకుని దానికి రాసినట్లుగా ఉండవు. కథనం మొత్తంగానే ఆ సామెతకు దారి తీసినంత సగాజంగా ఉంటాయి. ఈ రకంగా లోగడ సామెత కథలను డా.(శ్రీమతి) తెన్నేటి సుధాదేవి రాశారు. ఈ ప్రయోగాన్నే ఇంకొంచెం మార్చి 'లోగుట్టు పెరుమాళ్ళ కెరుక' అనే ఒక్క సామెతనే తీసుకుని పదిన్నొక్క కథ లల్లారు
స్వామి. కథలన్నిటికీ ఈ సామెతే శీర్షిక కనుక ప్రత్యేకించి శీర్షికేదీ లేకుండానే కేవలం సంఖ్యతో సూచించారు. ఈ కథల విషయికంగా విలాసం మాస పత్రిక సంపాదకులు చింతా ప్రభాకర రావును అభినందించాలి. ఎందుకంటే ఆయన కోరి మరీ రాయించి ప్రచురించారు. భవిష్యత్తులో ఎప్పటికో రావాల్సి ఉన్న ఈ కథల్ని రాయడాన్ని వేగిర పరిచా రాయన.

'లోగుట్టు పెరుమాళ్ళ కెరుక' అంటే మనిషి ఆన్తర్యంలోని ఎవరికీ తెలియని ఆలోచనలు పెరుమాళ్ళుకు తెలుస్తాయని. అయితే ' ఎవరీ పెరుమాళ్ళు?' అని ప్రశ్నించుకుంటే 'ఎల్.ఆర్.స్వామి' అనే సమాధానం వస్తుంది, ఈ కథల్ని చదివినప్పుడు. ఆ విధంగా 'ఎల్.ఆర్. పెరుమాళ్ళు' అనే మరో పేరును సంపాదించుకున్నారు స్వామి. కొస మలుపు ఒక మెరుపుగా కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ, లోగుట్టు సామెతకు అతికేలా అప్పటి వరకు జరిగిన కథనీ, కతాంశాల్నీ మలుపు తిప్పేదిగా ఉండడం ఈ కథల్లో చూస్తాం. సాదాసీదా మొదలు ఒక వర్ణన లోకి దారి తీస్తుంది. ఆ వర్ణన తరువా త్తరువాత కథలోని పాత్రల సహజ స్వభావానికి సరిపోతుంది. ఈ కథల్లోని మౌలిక శిల్పమిది. పోలికలతో కథనాన్ని నడపడం కూడా గమనిస్తాం. పోలికలు అమోఘంగా ఉంటాయి. వీటిలో పలుకుబడీ, నుడికారంతో సంపద్వంతమైన తెలుగు భాషను వాడతారు. ఉదాహరణకు కొన్ని-

" ఆప్యాయంగా మసలితే జలగలా అతుక్కుపోతుందేమో!"
" ఏడ్చి ఏడ్చి ఉబ్బుకుపోయిన ఆమె కళ్ళు ఎర్ర మందారాల్లా కనబడ్డాయి."
" వర్ధనమ్మ అన్నయ్య ఆమెతో పాదరసంలా అంటీ అంటనట్లు ఉంటాడు."

వీటిని కేవలం పోలికలుగానే భావిస్తే సరి కాదు. ఈ పోలికల వెనుక లోకరీతిని అద్భుతంగా పట్టి ఉంచుతారు స్వామి.

" చూడు, చుట్టాలు సముద్రం వంటి వాళ్ళు. దూరం నుంచి కాని ఒడ్డున నిలబడి కాని చూస్తె బాగుంటుంది."
" అంత వరకు పిల్లల కేరింతలతో, పడుచువాళ్ళ కబుర్లతో కళకళలాడిన పార్కు ఆత్మీయులు విడిచి పెట్టిన ముసలి వాడి ఇల్లులా ఉంది." అలాగే రిటైరైన ఉద్యోగి జీవితం -
" టెంక లోపల తొలుచుకు తినే పురుగున్నా బయట నిగనిగలాడే కలెక్టర్ మామిడిపండు లాంటిది."
"పదవీ విరమణ చేసినవాడి జీవితంలా రెస్టారెంటు ఖాళీ అయింది."

తెలుగు మాతృ భాషగా గలవారికంటే జీవద్వంతమైన భాషను రాయగలగడం గొప్ప విషయం. ఆంటీ, కార్లు, సిటీ వంటి సర్వ సాధారణమైన పదాలు తప్పిస్తే ఆంగ్ల పదాల్ని అంతగా ఉపయోగించరు స్వామి.

చాలా కథల్లో తప్పనిసరిగా కనబడే పాత్ర కర్చీఫ్. కళ్ళు ఒత్తుకునే సాధనంగా దర్శన మిస్తుంది. ఒక్కో కథలో పేరు మార్చుకుని ' చీర కొంగు' గా అవతారమేత్తుతుంది. ఎక్కువగా కళ్ళు ఒత్తుకునే సాధనంగానే దర్శనమిచ్చినా, ఒకటి రెండు కథల్లో చెమట పట్టిన మొహాన్నీ, మెడనీ ఒత్తుతూ కనబడుతుంది. జేబు రుమాలు పాత్ర ద్వారా సమాజంలో భద్ర జీవితాలకన్నా అభద్ర జీవితాలే ఎక్కువన్న విషయాన్ని స్వామి చెప్పకుండానే తెలియజేసినట్లైంది.

మొదటి రెండు కథల్లోనూ మౌలిక సారాంశం ఒక్కటే - ఓ వ్యక్తి చనిపోయాకా సంబంధీకులు ( అదీ తల్లీ కూతుళ్ళు) ఏడ్చే ఏడ్పు చనిపోయినందుకు కాదనీ, మరేదో దానికి కారణమనీనూ. మొదటి కథలో ఆ పాత్రను కూతురు పోషిస్తే, రెండో కథలో తల్లి పోషిస్తుంది. కారణం ఆర్దికాంశం కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ పదకొండు కథల్లోని ' లోగుట్టు' ముఖ్యంగా ఆర్ధిక సంబంధం కావడం గమనిస్తాం. మొదటి కథలో పెద్దమ్మ చనిపోతూ తన నగలూ డబ్బూ అయిన వారెవ్వరికీ ఇవ్వకుండా, చివరికంటా తనకు సేవ చేసిన పనిమనిషి బంగారమ్మకు ఇచ్చిందని తెలుసుకున్న బంధువులు, కూతురుతో సహా శవాన్ని వదిలేసి చక్కా పోతారు. అలాగే రెండో కథలో రామాయమ్మ ఏడుపు చనిపోయిన ఎనిమిదేళ్ళ కూతురు గురించి కాదనీ, ఆ అమ్మాయిని పణంగా పెట్టి తీసుకున్న రెండు వేల రూపాయల అప్పు గురించని తెలిసినప్పుడు విస్మయమౌతుంది. ఈ విధంగా ' లోగుట్టు'కు అసలు కారణం ఆర్దికాంశం కావడం ఎన్నో కథల్లో చూస్తాం.

కొంత ఖర్చుతో ఘనంగా విందిచ్చి, తన కివ్వాల్సిన పదిహేను వేల రూపాయల గొలుసును సొంతం చేసుకున్న తమ్ముడు, పదవీ విరమణానంతరం తండ్రికి వచ్చిన డబ్బును అతని దగ్గరున్న అక్క కైవసం చేసుకోక ముందే తన సొంతం చేసుకోవాలని భావించిన చెల్లీ, డబ్బున్న వారి పిల్లలకు తీసిపోకుండా కనబడాలనే తాపత్రయంతో తోటి విద్యార్థుల పుస్తకాలు దొంగిలించి, అమ్ముకుని,ఆ డబ్బుతో జల్సాలు చేసే విద్యార్థినీ, డబ్బు హోదా దర్పం ప్రదర్శించుకునే వేదికగా స్నేహితురాలి అమ్మాయి పెళ్లిని భావించి, భర్త వద్దన్నా వెళ్ళిన స్త్రీ ఒక మోసగాడి వలలో పడి తన నగలన్నీ
పోగొట్టుకోవడం - ఇలా ఆర్దికాంశమే అధికంగా 'లోగుట్టు' అవుతుంది. అయితే, ఆర్దికేతరమైన అంశాలు కూడా 'లోగుట్టు' కావడం కొన్ని కథల్లో ఉంది.

చిన్నప్పట్నుంచీ పని పిల్లగా ఉన్న కొండమ్మని వయసొచ్చేసరికి పనిలోంచి తీసేసిన అమ్మ గారి లోగుట్టు - ఆ అమ్మాయి పట్ల ఆవిడ భర్త చూపిన మొహం అయితే, ఎక్కడో పల్లెటూరిలో ఉన్న నిరుపేద మేనత్తని కారు పంపి రప్పించుకుని పట్టు చీర పెట్టి మరీ పంపించడంలో 'లోగుట్టు' కీర్తి కండూతి. జాలి గల వాడిగా మంచి పేరును కొట్టేయాలన్న పబ్లిసిటీ. అలాగే కాలదోషం పట్టిన వీసాను రక్షించుకుని, అమెరికా పౌరసత్వం సంపాదించడం 'లోగుట్టు'గా అందం చందం లేని అనకాపల్లి 'నల్ల బెల్లం దిమ్మ'ని పెళ్లి చేసుకుంటాడో అమెరికా సేటిల్డ్ ప్రబుద్ధుడు.

ఈ విధంగా సమాజంలో మనకి కనబడే రకరకాల మనుష్యుల ' లోగుట్టు'ల్ని ఈ కథల్లో బట్టబయలు చేసి పడేశారు స్వామి - మనసుల ఆంతర్యాలని పసిగట్టిన పెరుమాళ్ళు.

Posted by జ్యోతి Oct 12, 2010




క్రియ ఒకటే
జీ...వించడం!

బారులు దీరి
నెమ్మదిగా పాక్కుంటూ
దేనికోసమో ఆరాటపడుతూ
అధిగమించాలని పోటీ పడుతూ
క్రమశిక్షణతో...

బారులు దేలి
హాయిగా ఎగురుకుంటూ
దేనికీ ఆరాటం లేదనిపించేలా
మబ్బులతో పోటీ పడుతూ
స్వేచ్చాకర్షనతో...

క్రియ ఒకటే...
జీవించడమే!

సంసార సంచారం
సంచార సంసారం

పుట్ట నుంచి ప్రపంచంలోకీ...
ప్రపంచమంతా గూడుగానూ...

విస్తరించలేని కత్తిరింపు
కత్తిరించలేని విస్తరణ
చట్రంలో ఇరుక్కున్న్ పయనం
పయనమే బతుకు చట్రమైన వైనం

ఏదైనా జీవించడమే!

స్వేచ్చ తనకు తానైన బంధనం
రెక్క ముడవని నిరంతర శ్రమ జీవనం

బంధనంలోనే కల్పించుకున్న స్వేచ్చ
రెక్క విదిల్చిన తరంతర విహంగానం

జీవించడమే...
క్రియ ఒక్కటే-

వేరు వేరు సరళి
వినిపించేదొకే బ్రతుకు మురళి!

సంసార సంచారమైనా
సంచార సంసారమైనా...

అది జీవన సంబారమే!

రచన మాకినీడి సూర్యభాస్కర్

Posted by జ్యోతి Oct 3, 2010

This article was published in Navatarangam two years ago. After a surprising incident, I wish to republish this one here for B&G. You can know about that incident here...

పొద్దున్నే అంటే, నాలుగు గంటలకు, లేచి సంధ్యోపాసన చేసి, దైవ ప్రార్ధన చెసి, నిర్మలమైన మనస్సుతో కూర్చుంటే, నాలోని భ్రమలు తొలగి, అహం అణగి, మదమాత్సర్యాలు నశించి, ఆకాశాన సందె చుక్క కనిపించింది. దాని అందానికి ముగ్ధుడనై నే నాకసము వైపు నా దృక్కుని సారించగా తారల తళుకు బళుకులు నన్నమితాశ్చర్యమునకు గురి చేసినవి. అప్పుడే నాకు నేనెంత చిన్న వాడిననే భావన కలిగినది.

ఈ అందమైన పృకృతిని సృష్టించిన ఆ భగవానునికి మ్రొక్క బోగా, “నన్ను కాదు నాయనా, నన్ను గూర్చి తెలుసుకున్న వారి గురించి ఆలోచింపుము.  నీ సత్యాన్వేషణ ఫలిస్తుంది,” అన్న మాటలు ఎక్కడినుంచో వినవచ్చాయి. ఎవరా అని ఆలోచింపక, ఆ మాటల సారాన్ని అవగతం చేసుకునే ప్రయత్నమున మునిగి నాను. 

అంత నాకొకటే భావన…

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్,
శివాది షణ్మతముల గూఢములన్,
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావముల నెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన వారెందరో మహానుభావులూ……ఆఆఆ…..

ఇక మనసాగలేదు. అందుకే ఆ త్యాగ బ్రహ్మని తలంచుచూ… నా ఈ చిరు ప్రయత్నమును ప్రారంభించాను.
నాగయ్య గారు నటించిన త్యాగయ్యని అప్పట్లో చూడని తెలుగు వారు ఉండి ఉండరు. మా నాన్నగారి మాటల్లోనైతే మా ఊళ్ళో వాళ్లు బళ్ళు కట్టుకుని మరీ చూసిన సినిమా అది. సినిమా అనే మాట తక్కువ. చిత్రరాజం… ఊహూఁ. చూద్దాం. ఏమంటామో చివరకు. నటీ నటుల గురించి చెప్పనవసరం లేదు. ఈ కళాఖండానికి కర్త, కర్మ, క్రియ అన్నీ చిత్తూరు వి. నాగయ్య. అంటే నాగయ్యగారు. (ఇప్పుడు దొరికే DVD/VCD ల మీద లేబెల్ అలాగే ఇస్తున్నారు).

ఆయన ప్రతిభ గురించి మాటలాడే సాహసం చేయను. కానీ అతి కొద్ది మాటలలో నా అనుభూతులను పంచుతాను. మొదటి సారి గా నేను ఒక వేమన సినిమాని చూశాను. నా వయసుకప్పటికి అది మహా విసుగు అనిపించింది. నటీ నటుల గురించి నేను చెప్పను. కానీ కొన్ని రోజులతరువాత నేను ‘భక్త పోతన’ సినిమా చూశాను. అందులో పోతన పాత్ర దారి శాంత గంభీరమైన నటన, సరళ గంభీరమైన గాత్రం, నన్ను ఏవేవో లోకాలకి తీసుకుని పోయి, మైమరపించి, అలా టీవీకి నన్ను కట్టి పడేసినాయి.

అప్రస్తుతమైనా ప్రస్తుతమే ఇది. అందుకే ఇక్కడ వ్రాస్తున్నాను. ‘బొబ్బిలిరాజా’ సినిమా చూసి, అందులో వెంకటేష్ నటనకి My మరిచి కొన్నాళ్ళు ఆ అనుకరణ చేసిన నాకు, ఈ వ్యక్తీ నటన నచ్చటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. (అదే నా జీవితం లోని తొలి, ఆఖరి అనుకరణ. ఎందుకో నాకు అనుకరణ అంత నచ్చదు. ఎప్పుడన్నా ప్రయత్నించినా పొత్తు కుదరదు). కానీ నాకు ఆశ్చర్యం కలుగలేదు. ఆ నటునిలోని మహత్తు అలాంటిది. అందుకే ఇంకొటేదో సినిమా వస్తుంటే చూశాను. అందులోనూ ఆ పోతనే. అంతే. నేను మళ్ళీ టీవీ కి అతుక్కుని పోయి చూసిన ఆ సినిమా ‘నాగయ్యగారి వేమన’.

నా వయసు వారికి ఆ రోజుల్లో ఉండే అభిమాన నటులు కాకుండా Break the Rules అంటూ నాకు అభిమానం లో ఒక కొంగ్రొత్త కోణాన్ని చూపించిన నాగయ్యకి నివాళిగా…

ఈ చిత్రానికి ‘ఎందఱో మహానుభావులు’ పని చేశారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది, ‘జపేశన్’ పాత్రధారి ఐన ‘ముదిగొండ లింగమూర్తి’ గురించి. అసలు మన ముందు ఆ జపేశనే ఉన్నాడా అనేటంత సహజమైన నటనని ప్రదర్శించారు. ‘ఏమిరా త్యాగూ’ అంటూ ఆయన చెప్పే డైలాగ్ అప్పట్లో వాళ్ల బడిలో ఎవరన్నా మాట వినక పోతే వాళ్ల మాష్టారు వాడేవారని మా గురువు గారు చెప్పేవారు. అంటే అంత నలిగి ఉంటుంది ఆ తరం వారి నోళ్ళలో. ‘సుకవి నిల్చు జనుల నాల్కల పైన…’ అని చిన్నప్పుడు చదువుకున్నాను. గొప్ప నటులు కూడా అంతే. వారి వారి మేనరిజాల వల్ల. (ఇప్పుడూ ఉన్నారు. అది నా బాధ్యత కాదు).

కానీ ఆ మాటలు త్యాగరాజ మహాకవి విషయంలో మాత్రం ఎవరికీ చెప్పనవసరం లేదు. ఆయన సుకవే కాదు భక్త కవి కూడా. అంతేనా ఒక గొప్ప సృష్టి కర్త కూడా. ఎన్నెన్నో రాగాలని సృజియించిన సృజనశీలి ఆయన.
అంతటి ఆ మహా వాగ్గేయకారుని చరిత్రని తెరక్కెక్కించే సాహసానికి ఒడిగట్టారు నాగయ్యగారు. ఎంతో సాహసంతో, భక్తితో ఎన్నో విమర్శలు ఎదుర్కుని, ఖర్చుకోర్చి, తీసిన ఆ చిత్రం ఆయనని భక్తి చిత్ర నటునిగా అమరత్వాన్ని కలుగజేసింది.

త్యాగరాజ మహాకవి జీవితం లోని కొన్ని మధుర ఘట్టాలనూ, ఆయన మనకి ప్రసాదించిన గీతాలలో కొన్నింటిని, నాగయ్య గారు తనకే సాధ్యమైన శైలిలో మనకి అందజేసి మనలను ధన్యులని చేశారు. ఆయన గళం లో నుంచీ జాలువారిన ఆ త్యాగరాజ కృతులు ఎంతటి ఆనందాన్ని కలిగిస్తాయో… ఆ చక్కని పద ఉచ్ఛారణ అంత మహత్తరంగా ఉంటుంది. (కొందరు పెద్దలు పాడినప్పుడు వారి పాండిత్య ప్రదర్శనే తప్ప హావ భావాలలో త్యాగరాజ హృదయాన్ని అందుకోలేక పోయారు. ఎన్నోసార్లు విని నేను చెపుతున్న మాట ఇది. ఆ భక్తి కూడా కానరాదు). కానీ నాగయ్యగారి ప్రత్యేకత అక్కడే మనలని కట్టి పడేస్తుంది. ఆయన లీనమై, మనని కూడా లీనం చేస్తారు. భక్తి తప్ప ప్రదర్శనా ధోరణులు ఎంతమాత్రం కానరావు. ఆ రోజుల్లోనే కారులో తిరిగిన భోగి ఐన ఆయన ఈ భక్తి యోగి పాత్రని అంత గొప్పగా పోషించారంటే ఎంత ఆశ్చర్యమో నాకు. చేసే పని మీద దృష్టి తప్ప అన్యం తెలియదేమో ఆ మహా నటునికి. తప్పు తప్పు. మహానుభావునికి. కేవలం నటించటమే కాదు. దర్శకత్వాన్ని కూడా నేరిపి, సంగీతాన్ని అందించి, గానామృతాన్ని పంచ గలిగారంటేనే ఆయన బహుముఖ ప్రజ్ఞ, శక్తి సామర్ధ్యాలూ, చేసే పని పట్ల అనురక్తీ మనకి అర్ధం అవుతాయి.

ఇక సినిమా గురించి చెప్పాలంటే ముందు ఆయన ఇచ్చిన వివరణని గురించి చెప్పాలి. కొంచం అటూ ఇటూ గా ‘This is not an historically accurate account. Many popular legends are taken into account. This is for dramatization’s sake.” అందుకే కొన్ని చరిత్రకందని విషయాలూ ఉన్నాయి ఆ చిత్రం లో. అందులో ముఖ్యమైనది… ‘నారద మహర్షి’ మారు రూపం లో ప్రత్యక్షం అయ్యే సన్నివేశం.

అంతకు మునుపు స్వరార్ణవం కొరకు త్యాగయ్య బాధ పడే సన్నివేశాలని ఎంతో హృద్యంగా చిత్రీకరించ బడినాయి. అర్ధరాత్రి పూట స్వర రచనకు పూనుకుని, సాధించలేక (శిష్యుడు ‘బాగుంది గురువుగారూ’ అన్నా ఆయన తృప్తి పడరు.) ఆ తరువాత ఒక రోజున ఆయన వద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చి, ఎంతో దూరం నుండీ నేను మీ పాటను వినటానికి వచ్చాను. అని ఆయనను అడుగుతారు. అప్పుడు ‘రామానుగ్రహం పొందలేని మంద భాగ్యుని’ అని బాధపడటం, ఆ వ్యక్తి ఒక పోత్తమునిచ్చి ఆయనను పరిశీలించమనటం వెనువెంటనే జరిగిపోతాయి.
ఆయన పరిశీలించే సమయం లో ఆ సంగీత జ్ఞానం, సరస్వతీ కటాక్షం అక్షరాల రూపం లో అక్షరంగా ఆయనలో కలిసి పోవటం అప్పటి టెక్నికల్ స్టాండర్డ్స్ అనుసరించి అద్భుతమనే చెప్పాలి.
“ఎవరు స్వామీ మీరు?” అని అడుగగా ఆయనకు ప్రాప్తమైన సమాధానం… “మా అమ్మ వీణ వాయిస్తుంది.”
ఈ సమాధానం మరో మహానుభావుడు సముద్రాల రాఘవాచార్య (సముద్రాల సీనియర్) వ్రాసినది. ఈ చిత్రానికి వీరే సంభాషణలను కూర్చారు. వీరి గురించీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరు మా స్వగ్రామానికి చెందిన వారు.
ఈ సన్నివేశంలో చిత్రం ఏమిటంటే అప్పటి దాకా త్యాగరాజు పొందిన ఆవేదనంతా చేత్తో తీసేసినట్టుగా పోతుంది. అప్పుడు కలిగిన పులకరింతలో ‘శ్రీ నారదా మౌనీ’ అనే కీర్తనని పాడుతారు. మనకీ మనసు పులకరిస్తుంది. అరె! నారద మహర్షి ఇలాగే ఉంటారా? అని అనిపిస్తుంది. అతిశయోక్తి కాదు. ఒక్క సారి నారద మహర్షి రూపం (ఈ సినిమాలో వచ్చే క్షణకాలంలో) చూస్తే మన మనసులలో నుంచీ తొలగిపోదు. అనుభవించాలే గానీ వర్నించనలవిగాని ఆనందం కలుగుతుంది ఆ ఒక్క సన్ని వేషంతోనే. చారిత్రకంగా జరిగిందని చెప్పలేక పోయినా ఆ నారద మౌని అనుగ్రహం కలుగనిదే త్యాగ బ్రహ్మ ఇంతటి వ్యక్తిగా నిలిచేవారు కాదేమో. నా ఉద్దేశ్యం నాగయ్యగారు కూడా ఆ దేవర్షి అనుగ్రహం పొందారేమో!.

మరొక సన్నివేశం… “ఎందఱో మహానుభావులు” కీర్తన వచ్చే సమయంలో. ఆ సన్నివేశంలో ఎందఱో మహానుభావులు, సంగీత విద్వాంసులు ఒక సభలో కూడి ఉంటారు. త్యాగయ్య తన గురువు గారి ఆజ్ఞ మేరకు అచటికి వెళ్లి వారి ఆశీర్వాదములను, ఆనతిని (ఆయనే పాడమని కోరుతారు) పొంది ప్రారంభించే “ఎందఱో మహానుభావులు” అజరామరమై నిలిచి ‘పంచరత్నా’లలో ఒకటిగా కీర్తిని పొందగా, నాగయ్య గారి సన్నివేశ రూపకల్పన, imagination, గాత్రం, స్వరకల్పనా, తోటి నటుల నుంచీ తనకు కావలసిన effect ని పొందిన తీరూ, తెలుగు చిత్ర పంచరత్నాలలో ఒకటిగా చేశాయి.

త్యాగయ్య పాడటం అవగానే ఒక విద్వాంసుడు ‘బ్రహ్మానందం కలిగించారండీ త్యాగయ్య గారూ’ అనటం ఆ సన్నివేశంలో అక్కడి వారికే కాదు. చూసిన మనకి కూడా నాగయ్య గారు ‘బ్రహ్మానందాన్ని’ కలుగ జేశారు. అక్కడ త్యాగయ్య పాడే సందర్భంలో ఉన్నా వ్యక్తులు నిజంగానే లీనమైపోయి ఉంటారు. ఆ సహజత్వం చాలా అరుదు.

I planned a follow up for this article long ago. But did not finish it as I felt can I maintain the same standards. But now I finished one. And will publish it here in 10 days. 

Posted by గీతాచార్య Sep 16, 2010



ఒక నిర్దిష్టమైన కథను ఎన్నుకుని దానిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, అద్భుతమైన దృశ్యకావ్యంగా మలచబడిన చిత్రం కె.విశ్వనాధ్ సృష్టించిన  "సాగర సంగమం".  1983 లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ మన మనసుల్లో చెక్కు చెదరకుండా ఉంది. అందులోని పాటలు, సంగీతం, చిత్రీకరణ, నటీనటుల హావభావాలు .. ఆ కథలో మనకు గోచరించిన ఎన్నో అంశాలు మరపుకురానివి.

ప్రతిభ ఉన్నా గుర్తింపు రాని ఒక నాట్యకారుడి జీవన సంఘర్షణ ఈ చిత్రం.  బాలకృష్ణ (కమల్ హాసన్)ఒక పేద యువకుడు. స్వయంకృషితో నాట్యం నేర్చుకుని కూచిపూడి, భరతనాట్యం, కథక్ రీతులలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. కాని కృతిమత్వం, విచ్చలవిడితనం, వాణిజ్య, వ్యాపారధోరణి,నిర్లక్ష్యంతో నిండిన సినిమారంగంలో ఇమడలేకపోతాడు. అతని కళకు తగిన గుర్తింపు దొరకదు ఎందుకంటే అతడు పేదవాడు కాబట్టి. తన విద్యతో అందరిని మెప్పించి గొప్పవాడై తల్లిని సుఖపెట్టాలని కోరుకుంటాడు కాని అతనికి సాయపడేవాళ్లు ఉండరు. అతనిలో ప్రతిభను గుర్తించిన మాధవి ( జయప్రద) అతనిని ప్రోత్సహించి డిల్లీలో జరిగే కార్యక్రమంలో అతని నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయిస్తుంది. కాని చివరి క్షణంలో అతని తల్లి చనిపోవడంతో ఆ అవకాశం కోల్పోతాడు. అతనికి తోడుగా నిలిచిన మాధవిని ప్రేమిస్తాడు. కాని ఆమెకు చిన్నతనంలోనే పెళ్లైందని తెలిసి కృంగిపోతాడు. తిరిగి వచ్చిన భర్తకు ఆమెను అప్పగించి తాను దేశదిమ్మరిగా మారి తాగుబొతు అవుతాడు. కొన్నేళ్లకు అనుకోని పరిస్థితులలో మాధవి కూతురు శైలజ(శైలజ) నాట్యప్రదర్శనలో ఆమెని తప్పు పడతాడు. అప్పటికే తాగుడు వల్ల అతడి ఆరోగ్యం చెడిపోతుంది. కాని తన నాట్యానికి వారసులు లేరనే బాధ మిగిలేఉంటుంది. అది తెలుసుకున్న మాధవి బాలుని తన కూతురికి గురువుగా నియమిస్తుంది. భర్త పోయినా బాలుకి తెలియ కూడదని బొట్టు పెట్టుకుంటుంది మాధవి. వాళ్లిద్దరి స్నేహం చూసిన కూతురు కూడా అపార్ధం చేసుకుంటుంది. చివరకు  తన నాట్యకళనంతా శైలజకు నేర్పించి ఆమె నాట్యప్రదర్శన చూసి తృప్తిగా కన్ను మూస్తాడు బాలు.


ప్రతిభావంతుడైన ఒక కళాకారుడు తనను అష్టకష్టాలు పడి పెంచి నాట్యాన్ని నేర్పించిన తల్లి హటాత్మరణం, అండదండగా నిలిచి, ప్రోత్సాహాన్నిచ్చి జీవితాంతం తోడుంటుందనుకున్న స్నేహితురాలు దూరం కావడంతో నిరాశకు లోనై తాగుడు వ్యసనానికి బానిస అవుతాడు.  ఆ మత్తులొ తన బాధను మరచిపోవాలని అనుకుంటాడు. ఐనా కూడా ఆ కళాకారుడు తనలోని కళ తనతోనే అంతమైపోకూడదనుకుంటాడు. ఈ సినిమాలో మనకు నిత్యం ఎదురయ్యే సంఘటనలు స్పష్టంగా చూడవచ్చు. సినిమా ప్రపంచంలో కళలను వ్యాపారధోరణిలో అపహాస్యం చేస్తున్న తీరు, శైలజ నాట్యంలోని లోపాలు పట్టించుకోకుండా పత్రికలు, ప్రముఖులందరూ ప్రశంసించడం లాంటివి చూస్తుంటే నిజమైన కళాకారులకు అస్సలు గుర్తింపులేదనే విషయం అర్ధమవుతుంది. ఇక్కడ చెప్పుకోదగిన మరో విషయం కీర్తికాంక్ష, అహంకారంతో శైలజ చేసే నృత్యంతో చిత్రం ప్రారంభమవుతుంది కాని చివరికి అదే శైలజ వివేకం, మాతృభక్తి, గురుభక్తి కళమీది గౌరవంతో నాట్యంలో లీనమై ప్రదర్శన ఇస్తుంది. అప్పుడామెను చూసిన బాలు తనలోని కళను సంపూర్ణంగా ఆమెకు నేర్పించి మాధవి ఋణం తీర్చుకున్నానని సంతృప్తిగా కన్ను మూస్తాడు. బాలు మరణీంచినప్పుడు నాట్య ప్రదర్శనకు అంతరాయం కలగకుండా రఘు వీల్ చైర్ ని నిశ్శబ్దంగా బయటకు తీసికెళతాడు. అప్పుడే మొదలైన వానలో బాలు తడవకుండా మాధవి గొడుగుపడుతుంది. ఈ సన్నివేశంలో బాలు జీవితంలో చివరివరకు తోడున్న రఘు, మాధవి ఉన్నతమైన వ్యక్తిత్వాలు ఆవిష్కృతమవుతాయి.

మాధవి తనకు మహామహులైన కళాకారులు, విద్వాంసులు పాల్గోనే కార్యక్రమంలో తనకు కూడా చోటు కల్పించిందనే విషయం తెలిసినప్పుడు, ఆ ప్రదర్శనకు బయలుదేరేసమయంలోనే తల్లి మరణించిన సన్నివేశాలలో కమల్ హాసన్ ప్రదర్శించిన నటన అద్భుతం అని చెప్పవచ్చు. అవకాశం వచ్చిందన్న విషయం తెలిసినప్పుడు అతనిలో దుఖంతో కూడిన ఆనందం, నమ్మలేకున్నా అది వాస్తవమే అని కనపడుతుంటే అతనిలో పెళ్ళుబికిన ఆనందం, ఆశ్చర్యం నాట్యరూపంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ సందర్భంలో కమల్ నటన మహాద్భుతం అని చెప్పవచ్చు.  ఒకప్పుడు ఒకరినొకరు ప్రేమించి జీవితభాగస్వాములు కావాలనుకున్నా కూడా కాలేక తమ మధ్య అనుబందాన్ని ఇతరుల క్షేమాన్ని కోరుకునే స్నేహంగా మార్చుకుంటారు.  కళలను ప్రేమించే, గౌరవించే వారందరికీ కె.విశ్వనాధ్ అందించిన మరపురాని ఆణిముత్యం "సాగర సంగమం". ఈ చిత్రానికి అందించిన సంగీతానికి ఇళయరాజాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని పురస్కారం వచ్చింది. అలాగే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకుని పురస్కారం లభించింది.  అలాగే ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం కూడా లభించింది.


దర్శకత్వం : కె.విశ్వనాధ్
నిర్మాత : ఏడిద నాగేశ్వరరావు
సంగీతం : ఇళయరాజా
నటీనటులు: కమల్ హాసన్, జయప్రద,ఎస్,పి.శైలజ, శరత్ బాబు,

సాగరసంగమంలోని మధురమైన పాటలు వినండి మరి..

Posted by జ్యోతి Sep 14, 2010

Subscribe here

భువన సుందరి సీరియల్ చదవండి

భువన సుందరి సీరియల్ చదవండి
Keira Knightley: Beautiful Lady reading a Book

You said it!