మొత్తానికీ మహిళా బిల్లు బార్బేరియన్ల చేతి క్రింద నలక్కుండా గట్టెక్కింది. ఈ బిల్లు విషయంలో నా భావాలు, అభిప్రాయాలూ వేరైనా (అది తరువాతెప్పుడైనా తప్పక చెపుతాను) ఇప్పటికి మాత్రం శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా వేరొక సమస్య అలాగే మిగిలుంది. సరిగ్గా నాలుగు రోజుల క్రితం కూడా ఆ విషయాన్ని నేను అబ్జర్వ్ చేశాను. దానికి సంబంధించిన కథ, ఇప్పటికే నాది చదివి ఉంటారు, అయినా అది నిరంతరం జరుగుతున్న విషయానికే
సంబంధించింది కనుకా, క్రొత్త బ్లాగర్లున్నారు కనుకా, మరోసారి...
*** *** ***
ఈ రోజు న్యూస్ పేపర్ చూసి నేను షాక్ తిన్నాను. ఇంతలో నాకు ఎవరో పెద్దగా నవ్వటం వినిపించింది. ఆ షాకులో నాకు అది నిజమైన నవ్వో లేక నా చిత్తభ్రాంతో అర్థం కాలేదు.
కాలం సాగిపోయింది. అది నాకు గాలిలో తెలుస్తోంది. నీటిలో తెలుస్తోంది. అలా అయిదువందల సెకనులు గడిచిపోయాయి. THE LORD OF THE RINGS: THE FELLOWSHIP OF THE RING సినిమాలో VOICE OF THE RING తెలుగు డబ్బింగ్ లాగా ఉందా! ఇంతలో మావారు రావటంతో నేను ఈ లోకంలోకి వచ్చాను.
మా ఇంట్లో పనిమనిషిగా చేసిన సుబ్బి హత్య చేసింది. తన మొగుడిని. ఆ న్యూసే నన్ను షాకుకి గురి చేసింది. సెలయిను బాటిల్తో పొడిచి భర్తను చంపిన భార్య. అదే నేను చుసిన హెడ్డింగు.
"భలే కామెడీ కదూ!" మా ఆయన నా ముక్కు పట్టుకుంటూ అడిగారు. నేను ఆయన చేతిని నేట్టేస్తూ కుర్చీలోకూలబడ్డాను.
*** *** ***
నాలుగు రోజుల తర్వాత నేను సుబ్బిని కలిసాను. అప్పుడు జరిగన సంభాషణ ఇదీ.
నన్ను చూడగానే ఆత్మీయంగా నవ్వింది.
"ఏమి జరిగింది?" నేను అడిగాను.
"ఎప్పుడో జరగాల్సింది అమ్మగారూ. ఇప్పుడు జరిగింది." తను అన్నది.
తర్వాత జరిగిందంతా నాకు చెప్పింది.
*** *** ***
సుబ్బి కోన సీమ నుంచీ వచ్చింది. మా ఉద్యోగం నిమిత్తం మేము గుంటూరు వచ్చాము. మా పనిమనిషి గా తననే పెట్టుకున్నాము. చక చక పనులు చేస్తూ మా అభిమానాన్ని పొందింది. ఏడాది క్రితం పెళ్లి అయిన మేము ఇద్దరమూ ఉద్యోగాలు చేస్తూ ఉండటంతో మా అత్తగారికి సహాయంగా ఉండటానికి పనిలో పెట్టుకున్నాము. మా అత్తగారు మంచి మాటకారి. అవతలవారిని తేలికగా ఆకట్టుకుంటుంది. సుబ్బి మా అత్తగారితో మాటల సందర్భంలో తన సంసారం గురించి చెపుతూ తనకి ఇద్దరూ ఆడపిల్లలే అనీ, తనను ఆడపిల్లలను కన్నందుకు తన భర్త ఎన్ని రకాలుగా హింసిస్తాడో చెప్పుకునేది. రోజూ రాత్రి భోజనాల సమయంలో ఆవిడ ఈ విషయాలని మాతో చెప్పేది.
*** *** ***
సాయంకాలాల్లో మేము ట్యూషన్లు చెప్పుకుంటూ ఉంటాము. ఒక రోజు మా ఆయన Human Reproduction గురించి పిల్లలకి చెపుతూ x x chromosomes కలిస్తే ఆడపిల్లలు, x y chromosomes కలిస్తే మగ పిల్లలూ పుడుతారని చెపుతుంటే సుబ్బి ఆయన దగ్గరకు వెళ్ళింది. సుబ్బి ఆయనను ఏదో విషయం అడగటం ఆయన ఏదో చెప్పటం నేను వంట ఇంట్లో నుంచీ గమనించాను.
*** *** ***
కొన్నాళ్ళకు సుబ్బి మళ్ళీ గర్భవతి అయింది. మావారికి విజయవాడలో ఒక కాలేజిలో ఎక్కువ జీతంతో ఉద్యోగం రావటంతో మేము షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ సుబ్బికి భర్త వేధింపుకు ఎక్కువ అయ్యాయి. మా అత్తగారికీ తన గురించి దిగులు ఎక్కువ అయింది. నెలలు నిండటంతో సుబ్బి ఆసుపత్రిలో చేరింది. కానుపుకి రెండు గంటల ముందు తాగి వచ్చిన సుబ్బి మొగుడు ఈసారి మగ పిల్లాడు పుట్టకపోతే నరికేస్తానని అల్టిమేటం ఇచ్చాడు. సుబ్బి బిక్క చచ్చిపోయింది.
*** *** ***
సుబ్బి ఖర్మో ఏమో గానీ ఈసారీ ఆడపిల్ల పుట్టింది. ఇంతలో దాని మొగుడు గదిలోకి వచ్చాడు.
అయితే "రేయ్ నా కొడకా y క్రోమోజోము ని పంపకుండా x క్రోమోజోము ని పంపుతావుట్రా!" అంటూ సుబ్బి పక్కనే ఉన్న సెలయిను బాటిల్ ని పగల కొట్టి దాంతో తననికొట్టటానికి వస్తున్న మొగుడిని పొడిచింది.
*** *** ***
నేను ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పాను. మా ఆయన పెద్దగా నవ్వాడు.
"ఇలాంటి వాడికి తగిన శిక్ష పడింది." మా అత్తగారు అంది. ఆడపిల్లే తనకు మొదటి కానుపులో కావాలనే మా ఆయనతో నేను "x క్రోమోసోముని పంపకపోతే చంపేస్తాను," అన్నా. ఈసారి పెద్దగా నవ్వింది మా అత్తగారు.