‘ రాహుల్’ ‘ అనికేత్’ వీరిద్దరూ ‘ చంద్ర టి.వి’ ఛేనల్ కి మూలస్తంభాలు. రాహుల్ ఎం.డి అయితే, అనికేత్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్. ‘చంద్రుడిని పట్టి పీడించే రాహు_కేతువులనే ఛాయా గ్రహాలు వీళ్లు’ అని లోపాయ కారీగా ఆ యూనిట్ సభ్యులు అనుకోవడం కద్దు, కాని ఆ మాట బయటికి చెప్పే సాహసం ఎవరికీ లేదు.
‘కామిని’, ‘పిపాస’ వీరిద్దరూ తమ తమ ఆకొట్టుకొనే అందాలతో, మురిపించే మాటలతో, ఆహ్లాద పరిచే, విన్యాసాలతో ఆ చంద్ర లోకం లోని ‘ అభినవ తారామణులు . కాదు కాదు ‘కామినీ పిశాచాలు’ అని సదరు సభ్యులు అనుకొంటూ ఉంటారు, కాని బయటికి మాత్రం చెప్పరు.
సదరు సభ్యులు, తోకలు కోసిన, ‘కిష్కింధ సైన్యాలు’ అని అధికారుల అంచనా, అయినా వారు ఆ మాట బయటికి చెప్పరు.
బోర్డు మీటింగు మొదలయింది. ‘రాహు_కేతువులు’ , ‘కామినీ పశాచాలు’ ‘ తోకలేని కోతులు’ అందరూ కలిసారు. ఈ మధ్యనే వారందరూ కలిసి, ఒక ప్రత్యక్ష రామాయణాన్ని ( రియాల్టీ షో ) నిర్వహించారు. అడవిలోకి, ఆర్టిస్టులని తీసుకెళ్లి వాళ్లచేత పురుగులు, ఎలకలు, బల్లులు, తినిపించి, ‘పాములు, బొద్దింకలు, క్రిమి కీటకాలతో సహవాసం చేయించి, జయప్రదంగా కార్యక్రమాన్ని ముగించారు. కాని ఒక ఆపశృతి జరిగి పోయింది. కేతువు అడవి లోపలికి వెళ్లిపోయి, అదృశ్యమయ్యాడు. అందరికీ ఆందోళన కలిగింది. అయిదు రోజుల తరువాత తిరిగి వచ్చి, అడవిలో దారి తప్పి ఆటవికుల ఆశ్రయం పొందానని చెప్పాడు. వివరాలు మీటింగులో చెప్తానన్నాడు.
అందుకే ఏర్పాటయింది ఆ మీటింగు !
“ ఆ ఆటవిక జాతుల వారిది ‘కాకా తండా’ ! ‘కాకి’ వారి అభిమాన ఆరాధ్య పక్షి.! కృష్ణునికి ‘ నెమలి ఫింఛం’ ఎలాగో వాళ్లకి ‘కాకి ఈక’ అలాంటిది ! ఆఢా_మగా అందరూ కాకి ఈకలతో అలంకరించు కొంటారు---కేతువు వాక్ప్రవాహానికి అడ్డు పుల్ల వేసాడొక కోతి ! ”వాళ్లకి భాష ఉందా అనికేతువు గారూ ?” అంటూ.
“ ఉంది, కాని అది భాష కాదు ! పిట్టలు, కాకులు కూతల నుంచి, వాటి బాడీ లాంగ్వేజి (!!) నుంచి పుట్టిన భాష అది ! కేవలం శబ్దజాలం.! పాతిక ముఫ్ఫయి కన్న ఎక్కువ శబ్దాలు లేవు వాళ్ల భాషలో ! ఒకే శబ్దానికి, రక రకాల అర్థాలు ఉంటాయి. ఉదాహరణకి ‘ కా ‘ అనే శబ్దానికి ‘నేను, నా, నా కొరకు, నాకై, నన్ను” అనే అర్థాలు, ‘ కీ ‘ అనే శబ్దానికి, నువ్వు, నీ, నీ కొరకు, నీకై, నిన్ను’, అనే అర్థాలు ఉన్నాయి.
తో.లే కోతి ఊరుకోలేదు. “ అదెలా ! అనికేతువు గారూ ! అయోమయంగా ఉండదూ ?” అని ప్రశ్నించాడు.
“ఎందుకుండదు ? కాని భావ ప్రకటన, బాడీ లాంగ్వేజిని బట్టి అంతా అర్థమయి పోతుంది. మన ‘ “తెలుగు’ .లాగే ప్రాచీన హోదా పొందిన ఒక భాషలో ఒకే అక్షరాన్ని నాలుగు రకాలుగా సంభోదించడం లేదూ ! ‘ క’ అనే ఒకే అక్షరాన్ని, ‘ క, ఖ, గ, ఘ’ లు గాను, అలాగే ‘ చ. ట. త. ప’ లనే నాలుగేసి రకాలుగా పలకడం లేదూ ! అంత మాత్రాన ఆ భాషకి గౌరవం తగ్గిందా, చెప్పండి ?”
“ సరే ! అనికేతువు గారూ ! ‘ ఐ. లవ్. యూ’ ని ఏమంటారు కాకా తండా వారి శబ్దజాలంలో.”
“ కా, కీ, కువ కువ కో” అంటారు ‘ కా’ అంటే నేను, ‘కీ’ అంటే నిన్ను,కువకువ కో అంటే ప్రేమిస్తున్నాను. అని అర్థం.
“ నాకు ఆకలేస్తోంది. అనడానికి ?”
కా బూకా కో” అర్థమయిందా ?”
“ అర్థమయింది, ఆ భాషని మీరు అధ్యయనం చేసారా ?”
“ అధ్యయనం మాత్రమే కాదు, ఆ భాషలో ఒక స్క్రిప్టు తయారు చేసాను” అని చెప్పి, కేతువు తన కుర్చీలో కూర్చొన్నాడు. కేతువు కూర్చోగానే ‘ రాహువు’ లేచి నిల్చొన్నాడు. “ డియర్ ఫ్రెండ్స్ ! అనికేత్ స్క్రిప్టు నేను చదివాను. చాలా ఆసక్తికరంగా వాస్తవానికి దగ్గరగా ఉంది. కాకా తండాలో స్త్రీలని పోరి అని, పురుషులని పోకిరి అని అంటారు. పిల్లలని శాకిరి అని వారిలో మగపిల్లలని మాకిరి అని ఆడ పిల్లలని ఆకిరి అని పిలుస్తారు. అనికేతువు స్వయంగా చూసిన .రెండు కుటుంబాల కథ అది ! ముంబ, కంబ, పోకిరీలు ! చిత్తి, మిత్తి పోరీలు ! వీళ్లలో కంబ, చిత్తి దంపతులకి, ముగ్గురు మాకిరీలు, ఇద్దరు ఆకిరీలు సంతానం . మిత్తి, శాకిరీలు లేరనే చింతతో అనేక ప్రయత్నాలు చేసింది. వాటిలో ‘నక్క మాంసం’ భర్తకి తినిపించడమేనేది ఒకటి ! ఆ ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయి అన్నదే కథ ! ఈ స్క్రిప్టుని అదే అడవిలో, కాకా తండావారి వేష భాషలలో తీయాలని నేను నిర్ణయించాను.. మన ‘అడవి సీరియల్ ‘కి, ఇది చక్కని అనుబంధంగా తయారవుతుంది. అందుకే మన ఆర్ట్ ఢైరక్టర్ని, టెక్నీషియన్లనీ, అడవిలో సెట్ నిర్మించడానికి పంపించాను. త్వరలోనే మనమందరం తిరిగి, అరణ్య వాసం చేయాలి.” అన్నాడు రాహువు
సీన్ నెంబరు 1 : అడవిలో ‘ కాకా తంఢాలు’ నివశించే గ్రామంలో ఒక సెక్టర్ .
ఆర్టిస్టు స్టేటస్ : ‘ ____’ స్ట్రైట్ లైను( స్త్రైట్ లైను అంటే ఇద్దరు. ట్రై ఏంగిల్ అంటే ముగ్గురు, స్కేర్ అంటే నలుగురు, పెంటాగన్ అంటే ఐదుగురు, సర్కిల్ అంటే చాలామంది )
దుస్తులు:
పోకిరీకి, జంతు చర్మంతో చేసిన వాటిలాగ కనిపించే బెర్ముడా, వీపుకి క్రాస్ గా వెడల్పైన పటకా, ఆ పటకాకి కట్టిన అంబుల పొది!
పోరికి, పువ్వులు, ఆకులు లతలు ప్రింటు చేసిన నైలాన్ మేటుతో చేసిన పొడవైన లంగా, భుజానికి ఒక వైపు మాత్రమే పట్టీ కలిగిన బ్రాసరీ లాంటి టాప్ !
ఆభరణాలు: పూసలు, గవ్వల దండలు, తాయెత్తులు, కాకి ఈకలు !
దృశ్యం: ఒక గుడిశె బయట, చెట్టు మాను మీద కూర్చొని, ‘ పోరి’ ఏడుస్తూ ఉంటుంది. పోకిరీ గుడిశె లోంచి వస్తాడు.
డైలాగులు: కాకా తండావారి భాషలో ఉంటాయి. ( బ్రేకెట్లో వ్రాసిన, వాటి తెలుగు అనువాధం, స్కీన్ దిగువ డిస్ప్లే చేయాలి)
ఏక్షన్ & డైలాగ్ : మిత్తి, చెట్టు మాను మీద కూర్చొని, కన్నీరు చెంపల మీద ధారగా కట్టగా
( నోట్ మేకప్ చెదర కూడదు ! ) దుఃఖిస్తూ ఉంటుంది.
ముంబ : ఏ, మిత్తి పోరి ! కీ ఏకే నక్కో ! ( నువ్వు ఏడ్వకు )
మిత్తి : హే, ముంబ పోకిరీ ! కా, కువ కువ , దోన్ సలాబీకి ! శాకిరీ నక్కో !
( నా పెళ్లయి రెండేళ్లయింది, పిల్లలు లేరు )
ముంబ: కీ, ఏకే నక్కో ! కా, నక్కనేచి చిక్క !
( ఏడవకు, నేను నక్కని వేటాడి తెస్తాను )
మిత్తి : హే, పోకిరీ ! నక్క వాలి తోకచ, హొంబ భాగ్యాచి, నక్క నేచి చిక్క హొంబ, హొంబ భాగ్యాచి !
( నక్క తోక తొక్కి రావడమే ఎంతో అదృష్టం ! నక్కనే వేటాడి తేస్తే, చాల చాల అదృష్టం ! )
ఏక్షన్ : మిత్తి సంతోషంతో ముంబకి గుడ్ బై , గుడ్ లక్ చెప్తుంది. ముంబ హీరో స్టైలులో క్లోజప్ ఇచ్చి, అడవి వైపు వెళ్తాడు. విల్లు చేత్తో పట్టుకొని .
( సీన్ నెంబరు 1 కట్ ! )
సీన్ నెంబరు 2 అడవి లోపల వేటాడే సెక్టర్.
ఆర్టిస్ట్ స్టేటస్ : “ ___” (ఇద్దరు )ఒకరు ముంబ ! ఇంకొకరు నక్క తోక కప్పుకొన్న చిన్న కుర్రాడు/ జుజ్జొ
దుస్తులు: ముంబకి బెర్ ముడా, వీపు మీద పటకా, విల్లు, అంబుల పొది జుజ్జొకి, నక్క తోలు కప్పి, నక్క ముఖం మాస్క్,
ఆభరణాలు: ముంబకి పూసల దండలు, తాయెత్తులు, కాకి ఈక, జుజ్జుకి ఏమీ ఉండవు, తోక మాత్రం ఉంటుంది.
ప్రొపర్టీ : అచ్చు నక్కలా కనిపించే సాఫ్ట్ టాయ్. దానికి పొట్టలో బాణం గ్రుచ్చి ఉంటుంది గాయం దగ్గర టమోటో సాస్ !
ఏక్షన్ : ముందుగా జుజ్జొ పరుగు పెడుతూ ఉంటాడు. నక్కలాగ ! ముంబ దానిని తరిముతూ ఉంటాడు చివరికి గురిచూసి బాణం వదులుతాడు.
డైలాగ్స్: జుజ్జొ నక్కలాగ ఊళ పెడతాడు. ముంబ :హై, హై ! కాక దేవాచి ! హొంబ, హొంబ భాగ్యాచి ! ( కాక దేవా ! నీ దయకి చాలా చాలా సంతోషం ) ఏక్షన్ ముంబ, నక్క బొమ్మని, వెదురు బొంగుకి వేలాడ దీసి, సంతోషంతో గెంతుతూ గుడిశె వైపు దారి తీస్తాడు.
( సీను నెంబరు 2 కట్ ! )
సీను నెంబరు 3_________రిపీట్ సీను నెంబరు 1
ఆభరణాలు: పూసలు, దండలు, కాకి ఈకలు, తాయెత్తులు,
ఏక్షన్ : ముంబ గెంతుతూ నాట్యం చేస్తూ, వేటని తీసుకొని వస్తాడు. రెండవ గుడిశె దగ్గర మిత్తి, చిత్తి మాట్లాడుతూ ఉంటారు. కంబ విల్లుకి తాడు బిగిస్తూ ఉంటాడు. శాకిరీలు వీళ్లందరి చుట్టూ తిరుగుతూ ఆడుకొంటూ ఉంటారు.
డైలాగ్ : ముంబ: పోరీ ! పోరీ ! ఏ మిత్తి పోరీ ! కా నక్క నేచి చిక్కా !
మిత్తి : హే ! పోకిరీ ! హొంబ భాగ్యాచి , హొంబ భాగ్యాచి! చిత్తి పోరీ ! కంబ పోకిరీ ! హే, ఆకిరీ, మాకిరీ! ముంబ పోకిరీ నక్క నేచి చిక్కా ! చూరే, చూరే !
ఏక్షన్ : అందరూ ముంబని చుట్టు ముట్టి, నక్కని అతని భుజం మీద నున్న వెదురు బొంగు నుంచి దించుతారు సంతోషంతో చప్పట్లు !.
( సీన్ నెంబరు 3 కట్ )
సీను నెంబరు 4 రిపీట్ సీను నెంబరు 3
దుస్తులు రిపీట్ సీను నెంబరు 3
ఆభరణాలు: రిపీట్ సీని నెంబరు 3
దృశ్యం వండిన నక్క మాంసం . రెండు కుండలలో ఉంటుంది. మిత్తి ఒక కుండని శాకిరీలకి ఇస్తుంది. రెండో కుండని ఒక రాతి బండ మీద పెడుతుంది.
ఏక్షన్: శాకిరీలు, కుండని పట్టుకొని గెంతుకుంటూ, మరొక రాతి బండ మీద పెట్టి, చుట్ఠూ చేరి, అందులోని మాంసాన్ని పీక్కు తింటూ ఉంటారు. రెండవ కుండ ఉన్న రాతి బండ చుట్టూ మిత్తి, చిత్తి, ముంబ, కంబ కూర్చొంటారు.
అంతలో అనుకోని అవాంతరం జరిగింది.
ఒక పోకిరీ, ఎక్కడి నుంచో వచ్చి, ‘ మిత్తి’ నడుముని చేత చిక్కించుకొని, ఆమెని లేవ దీసి, భుజాల మీద వేసుకొని, అడవిలోకి పరిగెడుతాడు !
అది స్క్రిప్టులో భాగమే ననుకొని, తో.లే. కోతులు చూస్తూ ఉంటారు. అనికేత్ ఒక్కడే అలర్ట్ అవుతాడు. “ కామినీ ! నిన్ను ఎత్తుకు పోతున్నపోకిరీ, అసలు సిసలు పోకిరీ ! నువ్వు మంచిగా మాట్లాడి, వాణ్ని నీ మాకిరీని చేసుకో !” అని బిగ్గరగా అరుస్తాడు. `కామినికి విషయం అర్థమయింది. తనని మోసుకెళ్తున్న పోకిరీ భుజం తట్టి చెప్తుంది. “ ఏ పోకిరీ ! కా, కీ, కువ కువ నక్కో ! కా కాచ చుచ్చుచ్చు మాకిరీ ఆహే ! ( ఓరేయ్ , పోకిరీ ! నేను నిన్ను ప్రేమించడం లేదు, నువ్వు నా కొడుకు లాంటి వాడివి !)
పోకిరీ నిర్ఘాంత పోయి, ఆమెని క్రిందకి దించుతాడు. కామిని వెంటనే వాడి తలని తన గుండెల కేసి అదుముకొంటుంది. వాడు ఆమె పాదాలకి దండం పెట్టి, వెనక్కి తిరిగి చిత్తి దగ్గరకు వస్తాడు. విషయాన్ని అర్థం చేసుకొన్న చిత్తి వేషం లోని పిపాస కూడా, “ ఏ పోకిరీ ! కా, కీ కువ కువ నక్కో ! కీ, కాచ మాకిరీ ఆహే !” అంటూ వాడి తలని తన గుంఢెల కేసి, అదుముకొంటుంది. వాడు ఆమె పాదాలకి మొక్కి, నిరాశతో అడవి లోకి పారిపోతాడు.
అంతే ! అడవిలో ఆట విడుపు అయిపోతుంది.
రాహు కేతువులు, కామినీ పిశాచాలు, తో,లే. కోతులు, మళ్లీ విల్లంబులతో ఏ పోకిరీలు వెంట పడతారేమోనని కాలికి బుద్ధి చెప్తారు !